కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతుల పరిస్థితి దయనీయం: పువ్వాడ అజయ్
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు, విద్యుత్ సరఫరా దారుణంగా ఉందన్న పువ్వాడ
- ఎల్ నినోపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోలేకపోయిందని విమర్శ
- రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా లేక రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం కష్టపడి పండించిన పంటలను కాపాడుకునేందుకు అవసరమైన నీటిని, నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ ఏడు ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ సంకేతాలు ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో విఫలమైందని పువ్వాడ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ నిర్ణయాల వల్లే క్షేత్రస్థాయిలో పంట పొలాలు ఎండిపోయే తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ఎద్దడి, విద్యుత్ కోతల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, బాధితుల తరఫున పోరాటాలు చేస్తున్నప్పటికీ పాలకులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.
ప్రభుత్వ ఉదాసీనత కారణంగా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వెంటనే స్పందించి అధికారులు క్షేత్రస్థాయిలో ఎండిపోతున్న పంటలను స్వయంగా పరిశీలించాలని, అత్యవసర ప్రాతిపదికన సాగునీరు, అరకొర కోతలు లేకుండా ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.