జగన్ చేసిన మంచి పనులను చంద్రబాబు ఆయన ఖాతాలో వేసుకునేందుకు యత్నిస్తున్నారు: కాకాణి
- కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలకు పాల్పడుతోందన్న కాకాణి
- చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శ
- జగన్ తెచ్చిన సంస్కరణలతో ఎంతో మంది రైతులకు మేలు జరిగిందని వ్యాఖ్య
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. ఏపీ సర్కార్ 'క్రెడిట్ చోరీ' రాజకీయాలకు పాల్పడుతోందని... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ప్రజలకు చేసిన మంచి పనులను, సాధించిన విజయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేద ప్రజలకు పంపిణీ చేసిన భూములపై వారికి సర్వహక్కులు కల్పించే దిశగా జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కాకాణి ప్రశంసించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ పేదవాడికి భూ యాజమాన్య హక్కులు కల్పించడం కోసం 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీని కూడా జగన్ ఏర్పాటు చేశారని అన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న 'చుక్కల భూముల' సంక్లిష్ట సమస్యను పరిష్కరించడంలో చంద్రబాబు గతంలో పూర్తిగా విఫలమయ్యారని.. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దానికి శాశ్వత పరిష్కారం చూపి, అడ్డంకులు లేని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందని తెలిపారు.
తాము తీసుకొచ్చిన ఈ భూ సంస్కరణల విధానంతో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరిందని కాకాణి పేర్కొన్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా జగన్‌కు ఎక్కడ దక్కుతుందోనన్న అసూయతో కూటమి ప్రభుత్వం రీ-వెరిఫికేషన్ పేరుతో ఏకంగా 27 నెలల పాటు కాలయాపన చేశారని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వం చేసిన పనులను తమ సొంత కార్యక్రమాలుగా ప్రచారం చేసుకోవడం మాని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై కూటమి నాయకులు దృష్టి పెట్టాలని అన్నారు.