రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

రివ్యూలు కాదు.. రిజల్ట్స్ కావాలి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

Chandrababu Naidu demands results not reviews from Andhra Pradesh officials
  • రివ్యూలతో కాలయాపన వద్దు, ఫలితాలు చూపాలని కలెక్టర్లకు సీఎం స్పష్టీర‌ణ‌
  • ప్రో-యాక్టివ్‌గా పనిచేస్తూ, అభివృద్ధిలో జిల్లాలు, శాఖలు పోటీ పడాలని దిశానిర్దేశం
  • 'సీఈఓ' గుర్తింపు కన్నా 'వాటర్ మ్యాన్' అని పిలిపించుకోవడమే తనకు సంతృప్తి అన్న సీఎం
  • నకిలీ ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, వాస్తవ నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచన
  • 'వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్'తో స్వర్ణాంధ్ర సాధన సాధ్యమన్న చంద్ర‌బాబు
"గంటల తరబడి చేసే రివ్యూలు కాదు... నాకు క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలి. రియాక్టివ్ (ప్రతిస్పందించే) పాలన నుంచి ప్రో-యాక్టివ్ (చురుకైన) పాలన దిశగా అధికారులు మారాలి. ఆలోచనలు అద్భుతంగా ఉన్నా, వాటిని అమలు చేయకపోతే అవి నెరవేరని ఆశలుగానే మిగిలిపోతాయి" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. 

రాష్ట్ర సచివాలయంలో గురువారం ప్రారంభమైన 8వ జిల్లా కలెక్టర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు మొత్తం 12 గంటల పాటు సాగే ఈ కీలక సదస్సులో తొలిరోజు, పాలనలో తీసుకురావాల్సిన మార్పులు, అభివృద్ధి లక్ష్యాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

'వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్'.. ఇదే మన మిషన్
ప్రజా సేవకులుగా అహంభావాలకు తావివ్వకుండా పనిచేయాలని సూచించిన ముఖ్యమంత్రి, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలంటే ముందుగా యాజమాన్య బాధ్యత (ఓనర్‌షిప్) తీసుకోవడం అలవర్చుకోవాలని హితవు పలికారు. "ఫైల్ పెండింగ్‌లో ఉందంటే అభివృద్ధి పెండింగ్‌లో ఉన్నట్టే. ఫిర్యాదు పెండింగ్‌లో ఉందంటే ప్రజలకు న్యాయం ఆలస్యమవుతున్నట్టే. ప్రభుత్వాన్ని మభ్యపెట్టే నివేదికలు వద్దు, వాస్తవాలు నిర్భయంగా చెప్పండి. సమస్యను దాచిపెడితే అది పెద్దదవుతుంది, కానీ దానిపై బహిరంగంగా చర్చిస్తే పరిష్కారం లభిస్తుంది. సాధారణ పరిపాలన కాదు, ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించాలి. ఇందుకోసం శాఖలు, జిల్లాలు, సెక్రటరీలు, కలెక్టర్లు ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీపడాలి. 'వన్ స్టేట్-వన్ విజన్-వన్ టీమ్-వన్ మిషన్'... ఇదే మనందరినీ స్వర్ణాంధ్ర లక్ష్యం వైపు నడిపిస్తుంది" అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

'సీఈఓ' కన్నా 'వాటర్ మ్యాన్' గుర్తింపే ఆనందం
ఈ సందర్భంగా, సాగునీటి రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఎకనమిక్ టైమ్స్ పత్రిక ముఖ్యమంత్రిని 'సీఈఓ టు వాటర్‌మ్యాన్' అంటూ ప్రచురించిన కథనాన్ని ప్రస్తావించారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు, ఆ గుర్తింపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. 

"గతంలో గ్లోబల్ డ్రీమ్ కేబినెట్‌లో నా పేరు వచ్చినప్పుడు గానీ, నన్ను సీఈఓ సీఎం అన్నప్పుడు గానీ నేను ఇంతలా సంతోషించలేదు. రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు, భౌగోళిక అసమానతల కారణంగా నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రాంతాలకు నీటిని అందించగలిగినప్పుడే నాకు నిజమైన సంతృప్తి. ఆ నీటి భద్రత, సంరక్షణ చర్యలను గుర్తించి 'వాటర్ మ్యాన్' అని పేరు పెట్టినందుకు సంతోషంగా ఉంది" అని ఆయన భావోద్వేగంగా అన్నారు. 

ఈ వ్యాఖ్యల అనంతరం సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కృషికి అభినందనగా సమావేశంలో ఉన్న కలెక్టర్లు, అధికారులు, మంత్రులు లేచి నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవేషన్) గౌరవం తెలిపారు.

టీమ్ విజయంతోనే అభివృద్ధి సాధ్యం
గడిచిన 27 నెలల్లో రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టామని, రూ.1.40 లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని సీఎం వివరించారు. "హంద్రీనీవా, వెలిగొండ ఫేజ్-1, పోలవరం ఎడమ కాలువ ద్వారా నీళ్లిచ్చాం. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ విజయాలన్నీ ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదు. ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారంతో పాటు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక జట్టుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఇది టీమ్ సక్సెస్" అని చంద్రబాబు పేర్కొన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకుని, నకిలీ ప్రచారాలను తిప్పికొట్టాలి
ప్రతి జిల్లాలో 25 ప్రధాన ప్రాజెక్టులను, ప్రతి నియోజకవర్గంలో 10-15 ప్రాధాన్యతాంశాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. జిల్లాలో 'గ్రోత్ ఇంజన్లను' గుర్తించి సంపద సృష్టించాలని సూచించారు. "టెక్నాలజీని అందిపుచ్చుకుని 'డీప్ టెక్ గవర్నెన్స్' ద్వారా నిర్ణయాల్లో వేగం, సేవల్లో నాణ్యత పెంచాలి. కొందరు పనిగట్టుకుని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వాటిని వెంటనే గుర్తించి, వాస్తవాలతో తిప్పికొట్టాలి. డీఎస్సీ-2025 విషయంలో ఇద్దరు మహిళా అధికారులు సమర్థంగా స్పందించి వాస్తవాలను ప్రజల ముందుంచారు. వారిని అభినందిస్తున్నాను" అని సీఎం అన్నారు.

గత ప్రభుత్వ హయాంలోని 'జే బ్రాండ్' మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని, తాము కల్తీ బ్రాండ్లను రద్దు చేసి పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, నీటి భద్రత ఒక సవాలుగా మారిందని, అయినా తాగునీటి సరఫరాలో ఎలాంటి రాజీ పడబోమని హామీ ఇచ్చారు. సంక్షోభ సమయాల్లోనే కలెక్టర్ల నాయకత్వ పటిమ బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు. 

2027 నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రస్తుతం 13.44 శాతంగా ఉన్న రాష్ట్ర వృద్ధిరేటును 15 శాతానికి తీసుకెళ్దామని ఆయన అధికారులలో స్ఫూర్తి నింపారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
AP Collectors Conference
Andhra Pradesh Governance
Polavaram Project Completion
Swarnandhra Vision
Water Man Title

More Telugu News