సభలో రీల్స్, ఫొటోషూట్లు వద్దు.. నా దవడ ఎముక విరిగింది నిజమే: విజయ్ వ్యాఖ్యలకు స్టాలిన్ కౌంటర్
- మీసా చట్ట సమయంలో తన అరెస్ట్ పై విజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన స్టాలిన్
- అసెంబ్లీని రీల్స్ చేసే స్థలంగా మార్చవద్దని హితవు
- జైల్లో పోలీసులు చేసిన గాయాలు ఇప్పటికీ తన శరీరంపై ఉన్నాయని వ్యాఖ్య
తమిళనాడు శాసనసభ వేదికగా ఎమర్జెన్సీ కాలం నాటి ‘మీసా’ చట్టం, తన అరెస్టుపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు, ఆయన శారీరక అభినయంపై డీఎంకె అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. శాసనసభను రీల్స్ చేసే స్థలంగా మార్చవద్దని, అనవసరమైన వివాదాలు రేపకుండా ముఖ్యమంత్రి పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని ఆయన హితవు పలికారు. సభలో విజయ్ తన దవడపై చెయ్యి వేసి చూపించిన సైగపై స్పందిస్తూ... జైలులో పోలీసులు జరిపిన దాడిలో తన దవడ ఎముక విరిగిపోవడం నిజమేనని, ఆ గాయాల మచ్చలు నేటికీ తన శరీరంపై ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
1976 జనవరి 31న నాటి కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసిన మరుక్షణమే, గోపాలాపురం ఇంట్లో ఉన్న తనను అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారని స్టాలిన్ గుర్తుచేశారు. ఆ సమయంలో తాను ప్రచారంలో ఉండటంతో, "మా అబ్బాయి రేపు రాగానే నేనే స్వయంగా ఫోన్ చేసి పిలుస్తాను" అని కరుణానిధి పోలీసులకు చెప్పి, మరుసటి రోజు తనను జైలుకు పంపారని తెలిపారు.
రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికి విజయ్ చరిత్రను తవ్వే ప్రయత్నం చేస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. మీసా నిర్బంధంలో తనతో పాటు ఉన్న ఎంపీ చిట్టిబాబు జైలులోనే ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఈ త్యాగాలు డీఎంకె రక్తం, భావజాలంలో భాగమని, వాటిని ఎవరూ చెరిపివేయలేరని అన్నారు.
ప్రభుత్వం కట్టిన వంతెనలపై ఫొటోషూట్లు చేస్తూ, రీల్స్ పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్‌లా పాలన సాగిస్తున్నారని, తమ పరిపాలనా వైఫల్యాలను దాచడానికే విజయ్ ఇటువంటి వివాదాలను లేవనెత్తుతున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు.