భూమిని చూసే విధానమే మార్చేసే టెక్నాలజీ.. భారత స్పేస్‌ స్టార్టప్‌కు అమెరికా పేటెంట్‌!

భూమిని చూసే విధానమే మార్చేసే టెక్నాలజీ.. భారత స్పేస్‌ స్టార్టప్‌కు అమెరికా పేటెంట్‌!

GalaxEye Indian space startup gets US patent for Earth observation technology
  • గెలాక్సీఐకి అమెరికా పేటెంట్‌ లభ్యం
  • ఒకే ఉపగ్రహంలో ఆప్టికల్‌, రాడార్‌ సెన్సర్ల సమన్వయం
  • మేఘాలున్నా భూమిని గమనించే సామర్థ్యం
  • ‘మిషన్‌ దృష్టి’ ద్వారా అంతరిక్షంలోకి టెక్నాలజీ
  • ఐదేళ్లలో 30 ఉపగ్రహాల నెట్‌వర్క్‌ లక్ష్యం
భూమిని అంతరిక్షం నుంచి మరింత స్పష్టంగా గమనించే టెక్నాలజీని అభివృద్ధి చేసిన బెంగళూరుకు చెందిన భారత స్పేస్‌ స్టార్టప్‌ గెలాక్సీఐకి అమెరికా పేటెంట్‌ లభించింది. ఒకే ఉపగ్రహంలో ఆప్టికల్‌ కెమెరా, రాడార్‌ సెన్సర్లను సమన్వయం చేసి.. ఒకే ప్రాంతాన్ని ఒకే సమయంలో చిత్రీకరించే సాంకేతికతకు ఈ పేటెంట్‌ దక్కింది. భద్రత, వ్యవసాయం, బీమా, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో ఇది కీలకంగా మారే అవకాశం ఉంది.

సాధారణ ఆప్టికల్‌ కెమెరాలు భూమిని ఫొటో తీసినట్లుగా చిత్రాలను అందిస్తాయి. వీటితో రహదారులు, భవనాలు, పంటలు, నీటి వనరులు వంటి వివరాలను సులభంగా గుర్తించొచ్చు. కానీ వీటికి వెలుతురు అవసరం. మేఘాలు కమ్ముకున్నప్పుడు స్పష్టమైన చిత్రాలు తీయడం కష్టమవుతుంది.

ఇక్కడే ‘సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌’ (ఎస్‌ఏఆర్‌) ఉపయోగపడుతుంది. ఇది మైక్రోవేవ్‌ సిగ్నల్స్‌తో భూమిని గమనిస్తుంది. పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తుంది. మేఘాల వెనుక ఉన్న ప్రాంతాలను కూడా పరిశీలించగలదు.

ఇప్పటివరకు ఈ రెండు రకాల సమాచారాన్ని వేర్వేరు ఉపగ్రహాల నుంచి సేకరించాల్సి వచ్చేది. దీంతో చిత్రాలు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు కోణాల్లో లభించేవి. పోల్చినప్పుడు కచ్చితత్వం తగ్గేది. గెలాక్సీఐ రూపొందించిన టెక్నాలజీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఒకే ఉపగ్రహంలో రెండు సెన్సర్లను సమన్వయం చేసి.. ఒకే ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను ఒకే సమయంలో పొందేలా చేస్తుంది.

ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఇంజినీర్లు ఏర్పాటు చేసిన గెలాక్సీఐ.. మే 3న ‘మిషన్ దృష్టి’ ద్వారా ఈ టెక్నాలజీని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అయితే జులైలో సౌర తుపాను కారణంగా ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయాయి. అంతకుముందే కీలక వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించినట్లు సంస్థ తెలిపింది.

రాబోయే ఐదేళ్లలో 30 ఉపగ్రహాలతో భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని గెలాక్సీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో బెంగళూరుకు చెందిన ‘స్టార్‌ఆప్స్‌’ సంస్థను కూడా కొనుగోలు చేసింది. అమెరికా పేటెంట్‌తో ఈ భారత టెక్నాలజీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత బలం లభించే అవకాశం ఉంది.
Advertisement
GalaxEye
Indian Space Startup
US Patent
Satellite Technology
Mission Drishti
Earth Observation

More Telugu News