గుడ్డు తాజాగా ఉందో? లేదో? 10 సెకన్లలో తెలుసుకోండి.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ టిప్‌ ఇదే!

గుడ్డు తాజాగా ఉందో? లేదో? 10 సెకన్లలో తెలుసుకోండి.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ టిప్‌ ఇదే!

FSSAI shares 10 second tip to check if eggs are fresh or not
  • నీటితో గుడ్డు తాజాదనం తెలుసుకునే అవకాశం
  • అడుగున అడ్డంగా ఉంటే గుడ్డు తాజాగా ఉన్నట్లేనని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచన
  • నిలువుగా ఉంటే గుడ్డు పాతదని అర్థమని వెల్లడి
  • తేలితే పాడై ఉండే అవకాశం ఉందని వివరణ
  • వింత వాసన ఉంటే గుడ్డు వాడొద్దని సూచన
ఫ్రిజ్‌ తెరిచారు.. అందులో కొన్ని రోజులుగా ఉన్న గుడ్లు కనిపించాయి. అవి తాజాగా ఉన్నాయా? తినొచ్చా? అనే సందేహం రావడం సహజమే. పెంకును చూస్తే గుడ్డు పరిస్థితి తెలియదు. అలాగే అమ్మినవాళ్లు తాజావే ఇచ్చారా? అనే అనుమానమూ వస్తుంటుంది. అయితే ఇకపై అలాంటి సందేహాలు అవసరం లేదు. ఇంట్లో ఉన్న నీళ్లతోనే గుడ్డు తాజాగా ఉందో? పాతదైందో సులభంగా తెలుసుకోవచ్చు. ‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ సింపుల్‌ పద్ధతిని సూచించింది.

ఓ గ్లాసు నీళ్లు చాలు
ఓ గ్లాసులో సగం వరకు నీళ్లు పోయాలి. అందులో గుడ్డును వేయాలి. గుడ్డు నీటి అడుగుకు వెళ్లి అడ్డం తిరిగితే అది తాజాగా ఉన్నట్లు అర్థం. అదే అడుగున నిలువుగా ఉంటే గుడ్డు పాతదని అర్థం. అయితే వెంటనే దాన్ని పాడైందిగా భావించాల్సిన అవసరం లేదు. వాడే ముందు మరోసారి పరిశీలించాలి.

గుడ్డు నీటి పైకి తేలితే మాత్రం జాగ్రత్త. అది పాడై ఉండే అవకాశం ఉంది. అలాంటి గుడ్డును తినకుండా పడేయడం మంచిది.

పగలగొట్టాక కూడా చూడాలి
నీటి పరీక్షతో పాటు గుడ్డును పగలగొట్టిన తర్వాత కూడా కొన్ని విషయాలు గమనించాలి. గుడ్డులోంచి వింత వాసన వస్తే తినకూడదు. రంగులో మార్పు కనిపించినా వాడకూడదు. పెంకులో పగుళ్లు ఉన్నా, గుడ్డు నుంచి ద్రవం కారుతున్నా దాన్ని తీసుకోవద్దని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సూచిస్తోంది.

ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టాలి?
గుడ్లను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే వాటిని సరైన విధంగా భద్రపరచడం కూడా ముఖ్యం. తెచ్చిన ప్యాకింగ్‌లోనే గుడ్లను ఉంచడం మంచిది. ఇతర ఆహార పదార్థాల వాసనలు వాటికి పట్టకుండా ఇది ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌ తలుపులో కాకుండా షెల్ఫ్‌పై ఉంచడం మంచిది. తలుపు తరచూ తెరవడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పులు వస్తాయి.

ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్రిజ్‌ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌ లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టే ముందు కడగకూడదు. అవసరమైతే వాడే ముందు మాత్రమే కడగాలి. అలాగే కొన్న గుడ్లను ముందుగా ఉపయోగిస్తే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోవచ్చు.
Advertisement
FSSAI
Fresh eggs
Egg freshness test
Food safety tips
Egg storage guide
Water test for eggs

More Telugu News