కండలు పెంచడానికి కరెక్ట్ ఆహారం ఇదే!

కండలు పెంచడానికి కరెక్ట్ ఆహారం ఇదే!

This is the right diet to build muscle
  • కండరాల పెరుగుదలకు ప్రోటీన్‌తో పాటు కేలరీలు అవసరం
  • వ్యాయామం చేసేటప్పుడు పిండిపదార్థాలు మానవద్దు
  • వర్కౌట్‌కు ముందు, తర్వాత సరైన ఆహారం తీసుకోవడం ముఖ్యం
  • తగినంత నీరు, 7-8 గంటల నిద్ర కండరాల రికవరీకి కీలకం
జిమ్‌లో గంటల తరబడి శ్రమించినంత మాత్రాన సరిపోదు, కండరాల పుష్టికి సమతుల్య పోషకాహారం కూడా అత్యంత కీలకం. దృఢమైన కండరాల నిర్మాణం కోసం ఎటువంటి ఆహార నియమాలు పాటించాలనే అంశంపై అపోలో హాస్పిటల్స్ న్యూట్రిషనిస్టులు డాక్టర్ ప్రియాంక రోహత్గీ, డాక్టర్ అనితా జటానా పలు కీలక సూచనలు చేశారు.

ఎన్డీటీవీ కథనం ప్రకారం.. కండరాల పెరుగుదలను ఆశించే వారు తమ రోజువారీ అవసరాల కంటే అదనంగా 300 నుంచి 500 కేలరీల శక్తిని తీసుకోవాలి. అదేవిధంగా, శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.6 నుంచి 2.2 గ్రాముల చొప్పున ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. ఈ ప్రోటీన్‌ను రోజుకు 4 నుంచి 5 దఫాలుగా విభజించి తీసుకోవడం వల్ల కండరాల అభివృద్ధికి మెరుగైన ప్రయోజనం చేకూరుతుంది.

వ్యాయామం చేసే క్రమంలో చాలామంది పిండిపదార్థాలను పూర్తిగా పక్కన పెడుతుంటారు. అయితే, వర్కౌట్ చేయడానికి కావాల్సిన శక్తిని అందించడంలోనూ, కండరాల క్షీణతను అరికట్టడంలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వర్కౌట్‌కు గంట ముందు అరటిపండు వంటి తేలికపాటి ఆహారం, వ్యాయమం పూర్తయిన అరగంటలోపు ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

దైనందిన ఆహారంలో గుడ్లు, చికెన్ బ్రెస్ట్, చేపలు, పనీర్, సోయా, గ్రీక్ యోగర్ట్ వంటి అధిక ప్రోటీన్ కలిగిన పదార్థాలను చేర్చుకోవాలి. వీటితో పాటు ఓట్స్, బ్రౌన్ రైస్, చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కండరాల రికవరీకి రోజుకు కనీసం 3.5 నుంచి 4 లీటర్ల నీరు తాగడంతో పాటు, రాత్రివేళ 7-8 గంటలు గాఢ నిద్ర అత్యంత అవసరం.

అయితే, ఇవి కేవలం సాధారణ సూచనలు మాత్రమేనని, ప్రతి ఒక్కరి శరీర తత్వం వేర్వేరుగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కావున, వ్యక్తిగత శరీర స్వభావాన్ని బట్టి తగిన డైట్ ప్లాన్ కోసం తప్పనిసరిగా వైద్యులను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.
Advertisement
Muscle Building Diet
Apollo Hospitals
Dr Priyanka Rohatgi
High Protein Foods
Gym Nutrition Tips

More Telugu News