చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. రేపు 'నిజం గెలిచింది' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నారా లోకేశ్

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. రేపు 'నిజం గెలిచింది' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నారా లోకేశ్

Nara Lokesh calls for Nijam Gelichindi program on 3rd anniversary of Chandrababu Naidu arrest
  • రేపు 53 దీపాలు వెలిగించండి.. టీడీపీ శ్రేణులకు లోకేశ్ కీలక సందేశం
  • పార్టీ, పర్సనల్, ప్రభుత్వం అనే మూడు 'పీ'ల సూత్రాన్ని నేతలు పాటించాలని దిశానిర్దేశం
  • కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
  • వైసీపీ దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టాలని శ్రేణులకు సూచన
  • ఇది టీడీపీ 3.0 వెర్షన్.. అహంకారం వీడి సేవ చేయాలని నేతలకు హితవు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు రేపటితో (సెప్టెంబర్ 9) మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'నిజం గెలిచింది' పేరిట రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబును 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో నిర్బంధించినందుకు నిరసనగా, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చినందుకు గుర్తుగా పార్టీ కార్యాలయాలు, ఇళ్లు, బూత్ స్థాయిలో 53 దీపాలు వెలిగించి, ఆ రోజును 'బ్లాక్ డే'గా పాటించాలని ఆయన శ్రేణులకు సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్‌షిప్ కాంక్లేవ్ ముగింపు సభలో లోకేశ్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. కార్యకర్తల పోరాటాలు, త్యాగాల పునాదులపైనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. "ఒక తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య, మంజుల వంటి కార్యకర్తలపై గత ప్రభుత్వం దాడులు చేసింది. కొందరిని హతమార్చింది. వారి త్యాగాల వల్లే మనం ఇవాళ నాయకులుగా ఉన్నాం. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు" అని ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. నాయకులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యే వ్యూహాలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి కాంక్లేవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.

నేతలకు 'త్రీ-పీ' మంత్రం 
నాయకులంతా మూడు 'పీ'ల (పార్టీ, పర్సనల్, ప్రభుత్వం) సూత్రాన్ని తప్పక పాటించాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగతంగా (పర్సనల్) ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, మానవత్వం, అణకువతో వ్యవహరించాలని హితవు పలికారు. "ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రధాని మోదీ గారి నుంచి నేను ఈ విషయం నేర్చుకున్నాను. ఆయన నా నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. మనం కూడా విమర్శలను స్వీకరించి మార్పు చేసుకోవాలి" అని అన్నారు.

రెండో 'పీ' అయిన పార్టీ విషయంలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలని, అలకబూనిన వారిని దగ్గరకు తీసుకోవాలని సూచించారు. ఇక మూడో 'పీ' అయిన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. నేతలు కేవలం పోస్ట్ ఆఫీసుల్లా కాకుండా, తమ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి చొరవ చూపే లీడర్లలా వ్యవహరించాలని కోరారు. పాఠశాలలు, ఆసుపత్రులను తనిఖీ చేస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.

వైసీపీ దుష్ప్రచారంపై ఐక్య పోరాటం
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఐక్యంగా తిప్పికొట్టాలని లోకేశ్ పిలుపునిచ్చారు. "డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. డీఎస్సీపై మేం చిత్తశుద్ధితో 16 వేల పోస్టులు భర్తీ చేశాం. ఈ ఐదేళ్లలో 30 వేల పోస్టులు భర్తీ చేస్తాం. పోలీస్ నియామకాల్లోనూ అంతే. అయినా మనపైనే విమర్శలు చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించాలి" అని అన్నారు. సొంత బాబాయి హత్య కేసు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడని జగన్.. కేవలం డీఎస్సీపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్ అని, 'నో ఇగో, ఓన్లీ సర్వీస్' అనే నినాదంతో పనిచేయాలని లోకేశ్ స్పష్టం చేశారు. "పార్టీ నిర్ణయం తీసుకున్నాక అందరూ కట్టుబడి ఉండాలి. అహంకారం వద్దు, కలిసికట్టుగా రాష్ట్రాన్ని, పార్టీని నడిపిద్దాం" అని ఆయన ముగించారు. తన ఎదుగుదలకు కారణం కార్యకర్తల సహకారమేనని లోకేశ్ పేర్కొన్నారు.





Advertisement
Nara Lokesh
Chandrababu Naidu
TDP Nijam Gelichindi
Andhra Pradesh Politics
Chandrababu Naidu Arrest Anniversary
TDP Leadership Conclave

More Telugu News