ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి థ్రిల్లర్ నేపథ్యంలోని కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడపాదడపా మాత్రం యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందే సిరీస్ లు ఓటీటీ ట్రాక్ పై ప్రత్యక్షమవుతున్నాయి. అలా నిర్మితమైన సిరీస్ గా 'పార్ట్ టైమర్స్' కనిపిస్తుంది. తనూజ - జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ నుంచి, 8 ఎపిసోడ్స్ అందుబాటులో వచ్చాయి. సంపత్ కుమార్ తోట దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
తేజు (జ్ఞానేశ్వరి) శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రికి చాలా బిజినెస్ లు ఉంటాయి. కానీ తన కాళ్లపై తాను నిలబడాలనే ఉద్దేశంతో .. తనకి నచ్చినట్టుగా స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనతో ఆమె ఒక ఫ్లాట్ లో రెంట్ కి ఉంటుంది. క్యాబ్ నడుపుతూ తనకి ఖర్చులకి తగిన డబ్బును సంపాదించుకుంటూ ఉంటుంది. ఆవేశం .. లెక్కలేనితనం ఎక్కువ. అందువలన ఆ కమ్యూనిటీలో ఎవరికి కూడా ఆమె అంటే పడదు.
అలాంటి తేజుతో ఫ్లాట్ షేర్ చేసుకోవడానికి సింధు (తనూజ) వస్తుంది. సింధు తండ్రి లేని అమ్మాయి. తల్లితో కలిసి బాబాయ్ ఇంట్లో ఉంటూ ఉంటుంది. క్రమశిక్షణ పేరుతో బాబాయ్ ఆమెను ఇబ్బందిపెడుతూ ఉంటాడు. అంతేకాదు బంధువైన నవీన్ తో ఆమె పెళ్లి జరిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అది ఇష్టం లేని సింధు, ఆఫీసుకు దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో రెంట్ కి దిగుతుంది. అయితే గతంలో సింధుతో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న తేజు, ఆమెతో కోపంగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
సింధుని తేజు ఇబ్బంది పెడుతుందని గ్రహించిన కమ్యూనిటీ వాళ్లు, సింధును సపోర్ట్ చేయడం మొదలుపెడతారు. అదంతా సింధు చేయిస్తోందనే ఉద్దేశంతో ఆమెపై తేజు మరింత కోపాన్ని పెంచుకుంటుంది. కెరియర్ పరంగా ఇద్దరూ ఇబ్బందులలోనే ఉంటారు. ఆ పరిస్థితి నుంచి బయటపడటం కోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నాలు ఫలిస్థాయా? వాళ్ల జీవితాలలో కొత్తగా చోటుచేసుకునే మలుపులు ఎలాంటివి? అనేది మిగతా కథ.
కలవారి కూతురైన తేజు పంతానికిపోయి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయి స్వేచ్ఛగా బ్రతుకుంటూ ఉంటుంది. సమస్యలను .. సవాళ్లను ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. ఇక పేదింటి అమ్మాయి అయిన సింధు, తనకి ఇష్టం లేని పెళ్లి సంబంధం నుంచి తప్పించుకోవడం కోసం బయటికి వస్తుంది. జీవితంలో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఇద్దరికీ ఉంటుంది. భిన్నమైన స్వభావాలను కలిగిన ఇద్దరు అమ్మాయిల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
ఒక వైపున తేజు ఆమె ఫ్రెండ్ సర్కిల్. మరో వైపున సింధు ఫ్రెండ్స్ .. అపార్టుమెంటులో కమ్యూనిటీ వాళ్ల గొడవలు. ఇలా ఈ మూడు వైపుల నుంచి వినోదాన్ని రాబట్టడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక క్రమశిక్షణ పేరుతో బాబాయ్ చేసే హడావిడి .. 'మాకున్నంతలో' అంటూ తేజు తండ్రి మేనరిజంతో కాస్త హాస్యాన్ని పండించడానికి దర్శకుడు గట్టిగానే కష్టపడ్డాడు. అయితే ఈ కామెడీ కాస్తయినా వర్కౌట్ అయిందా అంటే కాలేదనే చెప్పాలి.
సింధు పాత్ర వైపు నుంచి చూసుకుంటే, ఆమె ఆఫీస్ కి సంబంధించిన వ్యవహారాలు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. అలాగే కెరియర్ పరంగా తేజుకి ఎదురైన సంఘటనలు కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. ఇద్దరికి సంబంధించిన ట్రాకులు చాలా సాదాసీదాగానే సాగిపోతూ ఉంటాయి. ఈ రెండు పాత్రల చుట్టూ ఉండే మిగతా పాత్రలు కూడా ఎంటర్టైన్ చేయలేకపోయాయి.
ప్రధానమైన పాత్రలు .. వారి కుటుంబ నేపథ్యాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ వెళుతుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్స్ లోని కథను ఫాలో అవుతూ వెళితే బలమైన సన్నివేశాలు పడలేదనే అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ లేకపోగా, నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడం కనిపిస్తుంది. కథ కూడా ఎపిసోడ్ ఎపిసోడ్ కి ప్రభావాన్ని పెంచకపోగా, అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. ఇక మున్ముందు పుంజుకుంటుందేమో చూడాలి.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగానే చేశారు. వివేక్ ఫొటోగ్రఫీ .. భరత్ మంచిరోజు సంగీతం .. తార చంద్రశేఖర్ రెడ్డి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇంకా మిగతా ఎపిసోడ్స్ రావలసి ఉంది గనుక, ఆ ఎపిసోడ్స్ లో కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది తెలియాలంటే వెయిట్ చేయాలి.
'పార్ట్ టైమర్స్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Part Timers Review
Movie Details
Movie Name: Part Timers
Genre: Drama
Release Date: 2026-08-28
Cast: Thanuja Puttaswamy, Gnaneshwari kandregula, Koushik, Rajesh Khanna, Ramesh
Director: Sampath Kumar Thota
PRO: -
Music: Bharath Manchiraju
Banner: Sandeep Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer