14 ఏళ్లకే మొదలు.. 20 ఏళ్లకే నెలకు రూ.5 లక్షలు.. తల్లి కోసం యువకుడి ప్రయాణం

14 ఏళ్లకే మొదలు.. 20 ఏళ్లకే నెలకు రూ.5 లక్షలు.. తల్లి కోసం యువకుడి ప్రయాణం

Bihar youth started at 14 and earns 5 lakhs monthly at 20 for his mother
  • 20 ఏళ్ల బీహార్‌ యువకుడి ఫ్రీలాన్సింగ్‌ కథ వైరల్‌
  • 14 ఏళ్లకే డిజైన్‌, ఎడిటింగ్‌ నేర్చుకున్న కుర్రాడు
  • డిగ్రీ చదవకుండా వెబ్3 రంగంలోకి ప్రవేశం
  • నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నానని వెల్లడి
  • గత నెలలో 6,500 డాలర్లు వచ్చాయని వెల్లడి
చదువు పూర్తిచేసి ఉద్యోగం సంపాదించాలి.. ఇదే చాలామంది యువత ఆలోచన. కానీ బీహార్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు మాత్రం అందుకు భిన్నమైన దారిని ఎంచుకున్నాడు. 14 ఏళ్ల వయసులో డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. మధ్యలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురయ్యాయి. చివరికి ఫ్రీలాన్సింగ్‌, వెబ్3 రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. డిగ్రీ లేకుండానే నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నానంటూ రెడిట్‌లో తన కథను పంచుకున్నాడు. అతడి జర్నీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఐదేళ్ల వయసు నుంచి తల్లి వద్దే పెరిగినట్లు ఆ యువకుడు తెలిపాడు. ఆర్థిక ఇబ్బందులతో సాగిన బాల్యంలోనే ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాడు. 2020లో 14 ఏళ్ల వయసులో ఆన్‌లైన్‌లో డిజైన్‌, ఎడిటింగ్‌ నేర్చుకున్నాడు. అప్పట్లో పబ్‌జీ ఈస్పోర్ట్స్‌ జట్ల కోసం గ్రాఫిక్స్‌ రూపొందించేవాడు. కొంతకాలానికే పబ్‌జీపై భారత్‌లో నిషేధం రావడంతో ఆ పని ఆగిపోయింది.

2024లో 12వ తరగతి పూర్తయ్యే వరకు ఫ్రీలాన్సింగ్‌ చేయాలా? ఉన్నత చదువులు కొనసాగించాలా? అనే సందిగ్ధంలో ఉన్నాడు. అదే సమయంలో నోయిడాలో వెబ్3 మార్కెటింగ్‌ ఏజెన్సీ ప్రారంభిస్తున్న పాత పరిచయస్థుడి నుంచి అవకాశం వచ్చింది. కాలేజీకి వెళ్లకుండా నోయిడా చేరాడు. నెలకు రూ.15 వేల జీతంతో పని మొదలుపెట్టాడు. భోజనం, వసతి కూడా సంస్థే కల్పించింది.

అయితే ఆ ఉద్యోగం సులభంగా సాగలేదు. ఖాళీ గదిలో ఒక పరుపు, ట్రాలీతోనే కొంతకాలం గడిపినట్లు చెప్పాడు. 18 ఏళ్లకే మద్యం, గంజాయి అలవాట్లకు లోనయ్యానని వెల్లడించాడు. ఐదు నెలల తర్వాత ఉద్యోగం వదిలి బీహార్‌కు తిరిగొచ్చాడు. మళ్లీ కొంతకాలం ఒంటరితనం, నిరాశ వెంటాడాయి.

ఆ తర్వాత టెక్నాలజీ కమ్యూనిటీలకు ఉచితంగా బ్రాండ్‌, లోగో డిజైన్లు చేయడం మొదలుపెట్టాడు. నెలకు 200-300 డాలర్లు సంపాదించేవాడు. తర్వాత వెబ్3 రంగంలో మరో పరిచయం ద్వారా సోషల్‌ మీడియా గ్రాఫిక్స్‌ పని దక్కింది. క్రమంగా క్లయింట్లు పెరిగారు. డిజైన్‌ పనులతో మొదలైన ప్రయాణం వెబ్3 సేవల వరకు వెళ్లింది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.12 లక్షలు సంపాదించినట్లు అతడు చెప్పాడు. నెలకు 2,000 డాలర్ల నుంచి 4,000 డాలర్లకు ఆదాయం పెరిగిందని తెలిపాడు. గత నెలలో ఏకంగా 6,500 డాలర్లు, అంటే సుమారు రూ.5.7 లక్షలు సంపాదించినట్లు పేర్కొన్నాడు.

తన ఆదాయంతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకున్నానని, ఎప్పటినుంచో కలగా ఉన్న మ్యాక్‌బుక్‌ ప్రో కొనుక్కున్నానని చెప్పాడు. అంతేకాదు.. తల్లిని ఆర్థికంగా ఉద్యోగం అవసరం లేని స్థితికి తీసుకొచ్చానని, ప్రతి కొన్ని నెలలకు బంగారం కొంటున్నానని తెలిపాడు. ఇన్నాళ్లూ అద్దె ఇంట్లోనే ఉన్న తమ కుటుంబం కోసం స్థలం లేదా ఫ్లాట్‌ కొనుగోలుకు కూడా డబ్బు దాచుకుంటున్నట్లు వెల్లడించాడు.

అయితే డబ్బు సంపాదించినా తన జీవితంలో కొన్ని విషయాలు కోల్పోయానని ఆ యువకుడు అంగీకరించాడు. ఇప్పటికీ ఒంటరితనం ఉందని, స్నేహితులు చాలా తక్కువ మందేనని చెప్పాడు. తన కథను గొప్పలు చెప్పుకోవడం కోసం కాకుండా.. తమ పరిస్థితులు మారాలని ప్రయత్నిస్తున్న వారికి స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో పంచుకున్నానని పేర్కొన్నాడు.
Advertisement
Bihar Youth
Web3 Freelancing
Graphic Design Earnings
Reddit Success Story
Online Income India
Freelance Video Editing

More Telugu News