ఎమ్మెల్యేలతో చావు రాజకీయాలు చేయిస్తారా?: వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు

ఎమ్మెల్యేలతో చావు రాజకీయాలు చేయిస్తారా?: వేముల ప్రశాంత్ రెడ్డి నిప్పులు

Vemula Prashanth Reddy accuses Revanth Reddy of conspiring against KCR life
  • కేసీఆర్‌ను అంతమొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ప్రశాంత్ రెడ్డి
  • కేసీఆర్ నివాసం ముట్టడి రేవంత్ ఆలోచనే అని ఆరోపణ
  • కేసీఆర్ చావు గురించి మాట్లాడినందుకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను భౌతికంగా అంతమొందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని... స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చావును కోరుకుంటున్నారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ... షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా ముఖంగా చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ నివాసమైన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌పై దాడులు చేస్తామని, 'చావు డప్పు' కొడతామని ఎమ్మెల్యే శంకర్ బహిరంగంగా వ్యాఖ్యానించడం రాజ్యాంగ ఉల్లంఘన అని మండిపడ్డారు.


"వెయ్యి డప్పులతో కేసీఆర్ ఇల్లు ముట్టడిస్తామన్నది శంకర్ వ్యక్తిగత మాట కాదు. అది వెనుకుండి నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనే" అని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల వేళ సభ్యులను సభకు రానివ్వకుండా కేసీఆర్ ఫాంహౌస్ కు కాంగ్రెస్ శ్రేణులను పంపి దాడులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ చావు గురించి మాట్లాడినందుకు గాను రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కాంగ్రెస్ ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని ఎద్దేవా చేశారు.

 

హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తూ, మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని తలపెట్టేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంలపై రాష్ట్ర డీజీపీ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisement
Vemula Prashanth Reddy
Revanth Reddy
K Chandrashekar Rao
Congress BRS political row
Erravelli farmhouse attack
Telangana assembly news

More Telugu News