ఐరాస కొత్త మ్యాప్‌లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్‌, అక్సాయ్‌చిన్‌.. భారత్‌ వైఖరేంటి?

ఐరాస కొత్త మ్యాప్‌లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్‌, అక్సాయ్‌చిన్‌.. భారత్‌ వైఖరేంటి?

UN new world map shows China lines on Arunachal and Aksai Chin what is Indias stand
  • అరుణాచల్‌ కు నాగాలాండ్‌తో సరిహద్దులు మ్యాప్‌ నుంచి తొలగింపు
  • అక్సాయ్‌చిన్‌కు పశ్చిమాన భారత్‌, తూర్పున చైనా
  • ఈ మార్పులకు కారణాన్ని వివరించని ఐరాస
  • జమ్మూ కశ్మీర్‌ ఎల్‌ఓసీని చుక్కల రేఖతో గుర్తింపు
  • అరుణాచల్‌, ఆక్సాయ్‌చిన్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ స్పష్టీకరణ

ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘కరెక్ట్‌ ది మ్యాప్‌’ తీర్మానానికి భారత్‌ మద్దతు తెలిపిన నేపథ్యంలో వెలువడిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌లను భారత్‌, చైనా వాదిస్తున్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు. అక్సాయ్‌చిన్‌ను లడఖ్‌లో భాగంగా భారత్‌ పేర్కొంటున్న విషయం తెలిసిందే.

ఐరాస సర్వసభ్య సమావేశం తీర్మానంపై చర్చలు జరుగుతున్న సమయంలో జులై 1న ఈ మ్యాప్‌ను తొలిసారి విడుదల చేశారు. ఇందులో అరుణాచల్‌ప్రదేశ్‌కు నాగాలాండ్‌తో ఉన్న సరిహద్దును తొలగించారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చూపిస్తూ.. పశ్చిమాన అసోం, ఉత్తరాన చైనా సరిహద్దుగా ఉన్నట్లు మ్యాప్‌లో పేర్కొన్నారు.

అదే విధంగా అక్సాయ్‌చిన్‌ను కూడా ప్రత్యేక ప్రాంతంగా చూపించారు. దాని పశ్చిమ వైపు భారత్‌, తూర్పు వైపు చైనా సరిహద్దులు ఉన్నట్లు మ్యాప్‌లో పేర్కొన్నారు. ఈ మార్పులు ఎందుకు చేశారన్న దానిపై ఐరాస ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

జమ్మూ కశ్మీర్‌ విషయంలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ని కూడా మ్యాప్‌లో చుక్కల రేఖతో చూపించారు. దీనిపై మ్యాప్‌ కింది భాగంలో ఐరాస వివరణ ఇచ్చింది. భారత్‌, పాకిస్థాన్‌ అంగీకరించిన జమ్మూ కశ్మీర్‌ ఎల్‌ఓసీని ఈ చుక్కల రేఖ సుమారుగా సూచిస్తుందని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌ తుది స్థితిపై సంబంధిత పక్షాల మధ్య ఇంకా అంగీకారం కుదరలేదని తెలిపింది.

‘కరెక్ట్‌ ది మ్యాప్‌’ తీర్మానం
ప్రపంచంలోని ప్రాంతాలను పటాల్లో మరింత కచ్చితంగా, సమానత్వంతో చూపించాలంటూ ఆఫ్రికన్‌ యూనియన్‌ మద్దతుతో తీసుకొచ్చిన ‘కరెక్ట్‌ ది మ్యాప్‌’ తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సమావేశం గత వారం ఆమోదించింది. ముఖ్యంగా ఆఫ్రికా ప్రాంతాల భౌగోళిక చిత్రణను మరింత సమానంగా చూపించడమే దీని లక్ష్యం. ఈ తీర్మానం చట్టబద్ధంగా అమలు చేయాల్సినది కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా బహుళపక్ష సంస్థలు ఉపయోగించే ప్రామాణిక ప్రపంచ పటాల్లో దీనికి అనుగుణంగా మార్పులు చేసే అవకాశం ఉంది.

భారత్‌ స్పందన
ఆఫ్రికన్‌ గ్రూప్‌ తరఫున టోగో ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లింది. భారత్‌ దీనికి మద్దతు తెలిపింది. సమాన విస్తీర్ణాన్ని ప్రతిబింబించే పటాల రూపకల్పన అనే మౌలిక సూత్రానికి మద్దతుగా తాము ఓటు వేసినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఏదైనా నిర్దిష్ట పటం, మ్యాప్‌ ప్రొజెక్షన్‌ లేదా దేశాల సరిహద్దుల చిత్రణకు ఈ తీర్మానం ఆమోదం కాదని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు సహా భారత సార్వభౌమ భూభాగాన్ని అధికారిక భారత పటం ప్రకారమే చూపించాలని పేర్కొంది. తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే చిత్రణను అంగీకరించబోమని తెలిపింది.
Advertisement
United Nations
Arunachal Pradesh
Aksai Chin
India China Border Dispute
UN World Map
Jammu and Kashmir

More Telugu News