స్పీకర్‌ను బెదిరించే హక్కు హరీశ్‌రావుకు ఎవరిచ్చారు?: శ్రీధర్ బాబు
- స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి మీరెవరని ప్రశ్నించిన శ్రీధర్ బాబు
- స్పీకర్ ను బెదరించేలా మాట్లాడటం సభా సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్య
- స్పీకర్ పై దూషణలు వీడియో ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడి
అసెంబ్లీ స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థలకే ప్రమాదకరమని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీని ఏ రకంగా నడపాలనే దానిపై స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి, "ఇలా చేయొద్దు.. అలా చేయొద్దు" అని శాసించడానికి ప్రతిపక్ష నేతలెవరని సూటిగా నిలదీశారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను బెదిరించేలా వ్యవహరించడం సభా సంప్రదాయాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. స్పీకర్‌పై జరిగిన దూషణల వ్యవహారంలో సదరు నేతలు ఏం మాట్లాడారో వీడియో ఫుటేజీల్లో అత్యంత స్పష్టంగా రికార్డై కనిపిస్తోందని తేల్చిచెప్పారు.
మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన సంఘటనలను ప్రభుత్వం, స్పీకర్ పక్కన పెట్టేస్తున్నారన్న బీఆర్ఎస్ విమర్శలను శ్రీధర్ బాబు పూర్తిగా కొట్టిపారేశారు. మహిళా ఎమ్మెల్యేల అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని శాసనసభాపతి స్వయంగా ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అయితే మహిళా ఎమ్మెల్యేల అంశాన్ని చూపిస్తూ, అదే సమయంలో స్పీకర్‌ను నేరుగా అవమానించిన అత్యంత తీవ్రమైన పరిణామాన్ని అసలు పట్టించుకోవద్దని ప్రతిపక్ష నేతలు మాట్లాడటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అత్యున్నతమైన స్పీకర్ వ్యవస్థపై దాడి జరిగిన వ్యవహారాన్ని పక్కన పెట్టాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన ఆయన, చట్టసభ నిబంధనలకు కట్టుబడి బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.