ఇద్దరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళదాం: రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్

ఇద్దరం రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళదాం: రేవంత్ రెడ్డికి కౌశిక్ రెడ్డి సవాల్

  • ఉప ఎన్నికలో రేవంత్ డిపాజిట్ తెచ్చుకుంటే ముక్కు నేలకు రాస్తానన్న కౌశిక్ రెడ్డి
  • అసెంబ్లీలో రేవంత్ వాడిన భాష అసహ్యకరంగా ఉందని విమర్శ
  • కత్తులతో నరుకుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని మండిపాటు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. "కొడంగల్ స్థానానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. హుజూరాబాద్‌లో నేను కూడా రాజీనామా చేస్తా. మళ్లీ జరిగే ఉపఎన్నికలో రేవంత్ రెడ్డి డిపాజిట్ తెచ్చుకుంటే సభ సాక్షిగా ముక్కు నేలకు రాస్తా" అని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాష, పదజాలం అసహ్యకరంగా ఉన్నాయని, తెలంగాణ సమాజమంతా ఈ అభ్యంతరకర వైఖరిని గమనిస్తోందని మండిపడ్డారు.


సభలో ప్రతిపక్ష సభ్యులను గౌరవించకుండా సీఎం ఇష్టానుసారంగా మాట్లాడారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోనే 'కత్తులతో నరుకుతాం' అని బహిరంగంగా బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. ఇవన్నీ పక్కనబెట్టి తమపై ఎథిక్స్ కమిటీ పేరుతో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం విడ్డూరంగా ఉందన్నారు.


పార్టీ ఫిరాయింపుల అంశంపై కడియం శ్రీహరి చేస్తున్న విమర్శలకు కౌశిక్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. "కోట్లాది రూపాయల నిధులతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ బీ-ఫారమ్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన వ్యక్తి కడియం శ్రీహరి. డిప్యూటీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవులు అనుభవించినప్పుడు ఆయనకు లేని నైతిక విలువలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా?" అని నిలదీశారు. స్వార్థ రాజకీయం కోసం తల్లిలాంటి పార్టీని వీడిన నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

Advertisement

More Telugu News