కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన్ విధింపు.. భారీగా మోహరించిన పోలీసులు
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు
- కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ ఎస్సీ సెల్
- ఫాంహౌస్ వైపు వెళ్లే అన్ని రహదారులను దిగ్బంధించిన పోలీసులు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల తీవ్ర పర్యవసానాలు ఇప్పుడు కేసీఆర్ ఫాంహౌస్ వరకు పాకాయి. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి గ్రామంలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పిలుపునివ్వడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నిరసనకారుల యత్నాలను, ఇరువర్గాల ఘర్షణలను అడ్డుకునేందుకు పోలీసులు ఎర్రవెల్లి పరిసర ప్రాంతాల్లో తక్షణమే 144 సెక్షన్ విధించారు. ఫామ్‌హౌస్ వైపు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను బారికేడ్లతో దిగ్బంధించి, పోలీసు వాహనాలతో పహారా కాస్తున్నారు.
మర్కుక్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీగా మోహరించిన పోలీసులు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తరలించేందుకు డీసీఎం వ్యాన్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఇదే సమయంలో ఎర్రవెల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ధర్నా శిబిరాన్ని పోలీసులు బలవంతంగా ఎత్తివేయడంతో పరిస్థితి రణరంగంగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల సవాళ్లు, పోలీసుల మోహరింపులతో ఎర్రవెల్లి పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.