మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సెప్టెంబర్ 7న 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ వయసులోనూ ఆయన ఫిట్‌నెస్‌, యంగ్ లుక్ చూసి సినీ పరిశ్రమ, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కండరాల బలం, శారీరక చురుకుదనం సహజంగా తగ్గే వయసులో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటం వెనుక ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉంది. పరిమితంగా ఆహారం తీసుకోవడం, క్రమం తప్పని వ్యాయామం, సరైన నిద్ర వంటి అలవాట్లే ఆయన ఫిట్‌నెస్ రహస్యాలుగా తెలుస్తోంది.

సూర్యకు స్ఫూర్తినిచ్చిన మమ్ముట్టి
తమిళ స్టార్ హీరో సూర్య సైతం మమ్ముట్టి ఆహారపు అలవాట్ల నుంచి స్ఫూర్తి పొందినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. "ఇష్టమైనది ఏదైనా తినొచ్చు, కానీ ఇష్టమొచ్చినంత తినకూడదు, కడుపు సగం నిండే వరకే తినాలి" అని మమ్ముట్టి తనకు సలహా ఇచ్చినట్లు సూర్య గుర్తుచేసుకున్నారు. పూర్తిగా మానేయడం కంటే, పరిమితంగా తినడమే మమ్ముట్టి డైట్‌లో కీలక సూత్రం.

డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది?
కొన్ని నివేదికల ప్రకారం, మమ్ముట్టి నూనెలో వేయించిన పదార్థాలకు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉంటారు. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు, నట్స్ వంటి పోషకాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఓట్స్ జావ, గుడ్డులోని తెల్లసొన, బొప్పాయి, నానబెట్టిన బాదం వంటివి తీసుకుంటారు. మధ్యాహ్నం అన్నానికి బదులుగా ఓట్స్ పుట్టుతో పాటు తక్కువ మసాలాతో వండిన చేపల కూర తింటారు. రాత్రిపూట గోధుమ లేదా ఓట్స్ దోశలతో చికెన్ లేదా చేపల కూర తీసుకుని, తేలికపాటి ఆహారంతో సరిపెడతారు. ఆయన వ్యక్తిగత చెఫ్ చెప్పిన ప్రకారం, వేయించిన చేపల కంటే చేపల పులుసునే ఆయన ఇష్టపడతారు.

వ్యాయామం, నిద్రకు అధిక ప్రాధాన్యం
ఆహార నియమాలతో పాటు, మమ్ముట్టి రోజూ జిమ్‌లో వర్కౌట్లు చేస్తారు. వయసు పెరిగేకొద్దీ కండరాల బలం తగ్గకుండా ఉండేందుకు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో వ్యాయామాలు చేస్తుంటారు. ఫిట్‌నెస్ విషయంలో వ్యాయామం ఎంత ముఖ్యమో, శరీరానికి సరైన విశ్రాంతి కూడా అంతే అవసరమని ఆయన నమ్ముతారు. అందుకే, షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నా, సరైన సమయానికి నిద్రపోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు.

మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం 'మేళా' టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒకవైపు నటుడిగా రాణిస్తూనే, మరోవైపు ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.