భారత క్రికెటర్ సంజూ శాంసన్, మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ మధ్య విభేదాలు తలెత్తాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇది. కేరళ క్రికెట్ లీగ్ (కేసీఎల్‌) 2026 ఫైనల్ బహుమతి ప్రదానోత్సవంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడమే ఇందుకు కారణమైంది. కేరళకు చెందిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్ల మధ్య మనస్పర్థలు ఉన్నాయంటూ ఊహాగానాలకు ఈ వీడియో తెరలేపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియోలో.. శ్రీశాంత్ వేదికపైకి వచ్చి పలువురిని కరచాలనంతో పలకరించడం కనిపిస్తుంది. అయితే, అప్పటికే ట్రోఫీ దగ్గర అధికారులతో నిలబడి ఉన్న సంజూ శాంసన్‌ను ఆయన పలకరించలేదు. శ్రీశాంత్ తన పక్క నుంచి వెళ్తున్నప్పుడు సంజూ చేతులు వెనక్కి కట్టుకుని నిలబడి ఉండటం ఆ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించి, అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో అభిమానులు రెండింటినీ ముడిపెడుతున్నారు. 2013లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి సంజూ శాంసన్‌కు తొలి ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇప్పించడంలో తాను కీలక పాత్ర పోషించానని శ్రీశాంత్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంజూ పేరును సిఫార్సు చేయడంతో పాటు కేరళ ఆటగాళ్లకు ప్రయాణ ఏర్పాట్లు కూడా తానే చేశానని తెలిపాడు. అయితే, ఈ సహాయాన్ని సంజూ ఇటీవలి కాలంలో పెద్దగా గుర్తించలేదనే అర్థం వచ్చేలా శ్రీశాంత్ మాట్లాడాడు.

నిజానికి గతంలో పలు ఇంటర్వ్యూలలో శ్రీశాంత్ తన కెరీర్‌కు ఎంతో సపోర్ట్ చేశారని సంజూ శాంసన్ స్వయంగా చెప్పాడు. ట్రయల్స్ సమయంలో తనకు అండగా నిలబడటంతో పాటు జట్టు ఎంపిక విషయాల్లో కూడా శ్రీశాంత్ సహాయం చేశాడని వివరించాడు. కాగా, సంజూ గానీ, శ్రీశాంత్ గానీ ఈ వైరల్ వీడియోపై గానీ, వస్తున్న ఊహాగానాలపై గానీ ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. వేదికపై జరిగిన ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనేది తెలియకపోయినా, ఈ వీడియో మాత్రం ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చర్చకు ఆజ్యం పోసింది.