హైదరాబాద్‌లో హైటెన్షన్: ఎమ్మెల్సీ తాతా మధును అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో హైటెన్షన్: ఎమ్మెల్సీ తాతా మధును అరెస్ట్ చేసిన పోలీసులు

High tension in Hyderabad as police arrest MLC Tata Madhusudhan
  • స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
  • మధును వెంటనే మండలి నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్
  • అరెస్ట్ సమయంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
  • పోలీసులే తనపై దాడి చేశారని తాతా మధు ఆరోపణ
  • మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (తాతా మధు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈరోజు ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సోమవారం అసెంబ్లీ గేట్ల వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాట సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి తాతా మధు అనుచిత పదజాలం ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై వాడిన భాష క్షమించరానిదని, ఇది శాసనసభ గౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని ఆయన పేర్కొన్నారు. తాతా మధును శాసనమండలి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక చీకటి రోజు అని సీఎం అభివర్ణించారు.

అయితే, తనపై వచ్చిన ఆరోపణలను తాతా మధు సోమవారమే ఖండించారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్‌ను కించపరిచినట్లు భావిస్తే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ వాటిని వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. అదే సమయంలో, పోలీసులే తనపై, తోటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడి చేశారని ఆయన ధ్వజమెత్తారు. తన పొత్తికడుపులో గుద్దారని, గొంతు నులిమారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.. ఈ ఉదంతంపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
Advertisement
Tata Madhusudhan
BRS MLC Arrest
Telangana Assembly Speaker
Hyderabad Police
Gaddam Prasad Kumar
BRS Congress Row

More Telugu News