బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. అది కోర్టు ధిక్కరణే!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. అది కోర్టు ధిక్కరణే!

KTR slams BRS MLCs arrest terms it contempt of court
  • ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్
  • అక్రమ కేసులతో కాంగ్రెస్ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపణ
  • 420 హామీలు నెరవేరిస్తే తామే స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామని సవాల్
  • మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బుధవారం ఉదయం ఈ అరెస్టులు జరిగాయి.

ఈ సందర్భంగా కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ప్రజాప్రతినిధులను శాసనసభకు వెళ్లకుండా ఆపవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా, ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని విమర్శించారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ అరెస్టులకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టుల పట్ల, చట్టం పట్ల ఉన్న అగౌరవాన్ని సూచిస్తోందని ధ్వజమెత్తారు.

దాదాపు 1000 రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్రమ అరెస్టులు, అన్యాయమైన నిర్బంధాలలో మాత్రం విజయం సాధించిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "మీరు ఇచ్చిన 420 హామీలను ఇప్పుడైనా అమలు చేస్తే, మా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరం స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాం. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా?" అని ఆయన సవాల్ విసిరారు.

సోమవారం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల చీరలు పట్టుకుని, మెడపై చేయివేసి దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల కనీస గౌరవం కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ దారి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు.
Advertisement
KTR
BRS MLCs Arrest
Tata Madhu
Naveen Reddy
Telangana Congress Government
Contempt of Court

More Telugu News