తాతా మధును బర్తరఫ్ చేయాలి, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తాతా మధును బర్తరఫ్ చేయాలి, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Dismiss Tata Madhu and KCR should apologize says Alleti Maheshwar Reddy
  • స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తాతా మధుపై ఆరోపణలు
  • మధు వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్న మహేశ్వర్ రెడ్డి
  • 22-ఏ అక్రమాలపై పొంగులేటి క్షమాపణ చెప్పాలని డిమాండ్

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలు శాసనసభ వేదికగా తీవ్ర దుమారాన్ని రాజేశాయి. సభలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌పై తాతా మధు వాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యేల తరఫున స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ తక్షణమే దీనిపై సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధు కావాలని మాట్లాడారా లేక ఎవరైనా మాట్లాడించారా అని ప్రశ్నించిన ఏలేటి... ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించిన సదరు ఎమ్మెల్సీని పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు. 


ఇదే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో తీవ్రస్థాయిలో మండిపడుతూ, కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని, మధుపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌కు జరిగిన తీవ్ర పరాభవంపై మంత్రి సీతక్క అసెంబ్లీలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టగా... స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా తీవ్ర మనస్తాపంతో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం సభను కుదిపివేసింది.


మరోవైపు 22-ఏ నిషిద్ధ భూముల వివాదంపై ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. 22-ఏ భూముల్లో జరిగిన అక్రమాలపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే క్షమాపణలు చెప్పాలని, అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు సభలోనే స్పష్టమైన హామీ ఇస్తే తమ నిరసనను విరమిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పకుండా ఇతర అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. 'ధరణి'పై నిజంగానే ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా అని నిలదీసిన ఆయన... ఒకవేళ జరిగితే ఆ ఆడిట్ నివేదికలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Advertisement
Tata Madhu
Alleti Maheshwar Reddy
KCR
Gaddam Prasad
Telangana Assembly
BRS

More Telugu News