అజిత్ అంజుమ్ విమర్శలకు సోనూసూద్ కూల్ రిప్లై!
- నేపాల్ బాధితులకు అండంగా నిలిచిన సోనూసూద్
- సెల్ఫ్ మార్కెటింగ్ అంటూ విమర్శించిన జర్నలిస్ట్ అజిత్ అంజుమ్
- ఇద్దరం కలిసి సాయం చేద్దామన్న సోనూసూద్
ఇటీవల సంభవించిన తీవ్ర వరదలతో అల్లాడుతున్న నేపాల్ ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనూసూద్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. బాధితులకు అవసరమైన దుప్పట్లు, ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర సరుకులను భారత్ నుంచి తరలించి, క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, సోనూసూద్ నేపాల్ పర్యటనపై ప్రముఖ జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. పనులు ఇంకా ప్రారంభం కాకముందే ఆయనను దేవుడిగా చిత్రీకరిస్తూ ప్రచారం చేసుకోవడం కేవలం 'సెల్ఫ్ మార్కెటింగ్' అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టడం కలకలం రేపింది.
అయితే ఈ ప్రతికూల విమర్శలపై సోనూసూద్ ఎంతో హుందాగా, సానుకూలంగా స్పందించారు. "సోదరా.. మీ మనసు చాలా మంచిది. మీరు నేపాల్‌కు రండి, మనమిద్దరం కలిసి ప్రజలకు అండగా నిలబడి సాయం చేద్దాం" అంటూ రీట్వీట్ చేశారు. ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా, తనను విమర్శించిన వ్యక్తినే నేరుగా సేవా కార్యక్రమంలో భాగస్వామి కావాలని ఆహ్వానించిన ఆయన తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సోనూసూద్ చూపించిన ఈ సంస్కారం, పరిణతిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
కాగా, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల్లో వరద విధ్వంసం తీవ్రంగా ఉందని, బాధితుల ఇళ్లను పునర్నిర్మించి వారు సాధారణ జీవితం గడిపే వరకు కొన్ని నెలల పాటు తమ 'సూద్ ఫౌండేషన్' తరఫున సహాయక చర్యలు కొనసాగుతాయని సోనూసూద్ స్పష్టం చేశారు. పరాయి దేశంలోనూ మానవత్వాన్ని చాటుకుంటూ ఆయన అందిస్తున్న సేవలకు గానూ అంతటా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.