కొండా దంపతుల డిమాండ్లు..? ఆ రెండు పార్టీలతో చర్చలు!

Konda couple demands and talks with two political parties
  • రెండు పార్టీల నేతలతో కొండా దంపతుల మంతనాలు
  • రెండు కీలక అసెంబ్లీ స్థానాలపై పట్టుబడుతున్నట్లు ప్రచారం
  • మంతనాలు శుక్రవారం రాత్రిలోపు కొలిక్కి వచ్చే అవకాశముందని చర్చ
  • కొండా సురేఖపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రస్థాయిలో ఎదురుదాడి
  • నాయిని, సారయ్య, గుండు సుధారాణి విమర్శలు
వరంగల్‌ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి కొండా సురేఖ దంపతుల చుట్టూ రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. పార్టీ మారే అవకాశాలపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. రెండు ప్రధాన పార్టీల నేతలతో వారు జరుపుతున్న మంతనాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రెండు కీలక అసెంబ్లీ స్థానాలు కేటాయించే పార్టీ వైపు వెళ్లాలనే ఆలోచనలో కొండా దంపతులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ఓ ప్రధాన ప్రాంతీయ పార్టీతో పాటు మరో పార్టీకి చెందిన ముఖ్య నేతలతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మంతనాలు శుక్రవారం రాత్రిలోపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

కొండా సురేఖపై కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కుడా ఛైర్‌పర్సన్‌ గుండు సుధారాణి మీడియా ముందుకు వచ్చారు. కొండా దంపతుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

మీడియా, సోషల్‌ మీడియాలో హైలైట్‌ కావడానికే అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు.. మరోవైపు ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై కొండా దంపతుల మంతనాలతో వరంగల్‌ కాంగ్రెస్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Advertisement
Konda Surekha
Konda Murali
Warangal Politics
Telangana Congress
Party Change Rumors
Revanth Reddy

More Telugu News