కోడింగ్‌లో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌కు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కొత్త అస్త్రం.. జెమినీ 3.8 ఫ్లాష్‌ వచ్చేస్తోంది!

Google almost ready to launch new Gemini AI model
  • కొత్త జెమినీ మోడల్‌తో గూగుల్‌ భారీ కమ్‌బ్యాక్‌కు రెడీ
  • ‘స్కిమాకీ’ పేరుతో అంతర్గతంగా పరీక్షలు
  • కొందరు ఇంజినీర్లలో ఆంథ్రోపిక్‌ ఓపస్‌ కంటే మెరుగన్న అభిప్రాయం
  • జెమినీ 3.5 ప్రో ఆలస్యంతో గూగుల్‌పై పెరిగిన ఒత్తిడి
  • కోడింగ్‌ ఏజెంట్ల రంగంలో మస్క్‌, మెటా నుంచి పోటీ
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రేసులో గూగుల్‌ కాస్త వెనుకబడిందన్న చర్చ జరుగుతున్న వేళ.. ఆ కంపెనీ మళ్లీ దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా కోడింగ్‌ విభాగంలో ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌ను ఢీకొట్టేందుకు కొత్త జెమినీ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ నివేదిక ప్రకారం.. అంతర్గతంగా ‘స్కిమాకి’గా పిలుస్తున్న ఈ మోడల్‌ను జెమినీ 3.8 ఫ్లాష్‌ పేరుతో విడుదల చేసే అవకాశం ఉంది.

ఈ మోడల్‌ను సెప్టెంబర్‌ 2నే విడుదల చేయొచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే గూగుల్‌ ఉద్యోగులు దీనిని అంతర్గతంగా పరీక్షించినట్లు సమాచారం. గూగుల్‌ కోడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జెట్‌స్కీలో నిర్వహించిన అంతర్గత పరీక్షల్లో కొందరు ఇంజినీర్లు ఆంథ్రోపిక్‌ ఓపస్‌ మోడల్‌ కంటే జెమినీ 3.8 ఫ్లాష్‌ను మెరుగ్గా భావించినట్లు తెలుస్తోంది.

అయితే ఇది గూగుల్‌ తదుపరి ఫ్రాంటియర్‌ మోడల్‌ కాదు. ఫ్లాష్‌ మోడళ్లు తక్కువ పరిమాణంలో ఉండి.. వేగంగా, తక్కువ ఖర్చుతో స్పందించేలా రూపొందిస్తారు. వీటిని త్వరగా మార్చి, వివిధ విధానాలను ఏకకాలంలో పరీక్షించడం సులభం. అందుకే గూగుల్‌ ఇటీవలి కాలంలో ఫ్లాష్‌ మోడళ్లపై వేగంగా ప్రయోగాలు చేస్తోంది. జులైలో జెమినీ 3.6 ఫ్లాష్‌ విడుదల కాగా.. మూడు వారాలకే 3.7 ఫ్లాష్‌ వచ్చింది.

గూగుల్‌కు ఈ కొత్త మోడల్‌ కీలకంగా మారింది. జెమినీ 3.5 ప్రో అంతర్గత కోడింగ్‌ ప్రమాణాలను అందుకోలేకపోవడంతో దాని విడుదల ఆలస్యమైందని సమాచారం. మరోవైపు తదుపరి ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ జెమినీ 4 శిక్షణ దశలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ.. ఇంకా పోస్ట్‌-ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంటోంది.

ఇదే సమయంలో కోడింగ్‌ ఏఐ మార్కెట్‌లో పోటీ మరింత పెరిగింది. ఆంథ్రోపిక్‌, ఓపెన్‌ఏఐతో పాటు ఎలాన్‌ మస్క్‌ సంస్థ నుంచి గ్రోక్‌ కోడింగ్‌ మోడళ్లు, మెటా నుంచి మ్యూజ్‌ కోడ్‌ వంటి ఏఐ కోడింగ్‌ ఏజెంట్లు వచ్చాయి. దీంతో గూగుల్‌పై మరింత వేగంగా కొత్త మోడళ్లను తీసుకురావాలన్న ఒత్తిడి పెరిగింది.

జెమినీ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది వినియోగదారులను దాటినా, ఎంటర్‌ప్రైజ్‌ మార్కెట్‌లో గూగుల్‌కు సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు జెమినీ 3.8 ఫ్లాష్‌ ద్వారా కోడింగ్‌లో తిరిగి ఆధిపత్యం సాధించగలదా అన్నదే ఆసక్తికరంగా మారింది.
Advertisement
Google
Gemini
Google Gemini
Gemini AI Model

More Telugu News