చంద్రుడు, అంగారకుడిపై ఇల్లు ఎలా? భారత వ్యోమగామి చూపించిన భవిష్యత్‌ దారి!

Shubhanshu Shukla reveals future path for living on Moon and Mars
  • భూమి ఆవల నివాసాలపై శుభాన్షు శుక్లా పరిశోధన
  • ‘భీమ్‌’‌ పేరుతో కొత్త హ్యాబిటాట్‌ కాన్సెప్ట్‌
  • చంద్రుడు, అంగారకుడిపై నివాసాలే పరిశోధన లక్ష్యం
  • రేడియేషన్‌, ఉష్ణోగ్రతల నుంచి రక్షణ
  • ‘భీమ్‌’ అనేది ప్యానళ్లతో తయారయ్యే మాడ్యులర్‌ అంతరిక్ష నివాసం
భూమి నుంచి చంద్రుడిపైకి.. అక్కడి నుంచి అంగారకుడిపైకి మనిషి అడుగులు వేయాలని చూస్తున్నాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఎక్కడ నివసించాలి? ఎలా బతకాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భారత వ్యోమగామి గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా. భూమికి ఆవల మనుషులు నివసించేందుకు వీలుగా ‘భారతీయ హ్యాబిటబుల్‌ ఎక్స్‌పాండబుల్‌ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్‌ హ్యాబిటాట్‌’ (BHEEM) అనే కాన్సెప్ట్‌ను ఆయన రూపొందించారు.

రష్యా నుంచి శిక్షణ పూర్తి చేసుకుని భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత శుభాన్షు ఈ పరిశోధనపై పనిచేశారు. వ్యోమగాముల శిక్షణలో భాగంగా భారత ప్రయోగ వాహనం, ఆర్బిటల్‌ మాడ్యూల్‌ వ్యవస్థలపై అవగాహనతో పాటు శారీరక శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన సన్నద్ధతను అందించారు. అదే సమయంలో భవిష్యత్‌ అంతరిక్ష అన్వేషణపై పరిశోధనలు చేసే అవకాశం కూడా కల్పించారు.

దీంతో తాను ప్రయాణించే అంతరిక్ష నౌక తర్వాతి దశపై ఆలోచించినట్లు శుభాన్షు తెలిపారు. చంద్రుడు, అంగారకుడి వంటి ప్రాంతాల్లో మనుషులు నివసించి పనిచేయాలంటే ఎలాంటి వసతి అవసరమో పరిశోధించారు. బెంగళూరులోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’ (ఐఐఎస్సీ)లోని అలోక్‌ ల్యాబ్‌లో ఈ పరిశోధన రూపుదిద్దుకుంది.

అంతరిక్షంలో ఇల్లు కట్టడం అంత సులభం కాదు. తీవ్రమైన రేడియేషన్‌, విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి వ్యోమగాములను రక్షించాలి. గాలి, నీరు, విద్యుత్‌ వంటి అవసరాలకు నిరంతర వ్యవస్థలు ఉండాలి. భవిష్యత్తులో ఆ నివాసాలను అవసరానికి అనుగుణంగా విస్తరించే సదుపాయం కూడా కీలకం.

‘‘మనుషులు మరో 20 ఏళ్లలో భూమికి ఆవల నివసించాలంటే.. ఆ పని 20 ఏళ్ల తర్వాత మొదలుపెట్టలేం. ఇప్పుడే మొదలుపెట్టాలి’’ అని శుభాన్షు అన్నారు. మరో ప్రపంచంలో హ్యాబిటాట్‌ నిర్మించాలంటే తొలి అడుగు ఇటుక వేయడం కాకపోవచ్చు.. అది ఎలా ఉండాలో ఊహించడానికి ధైర్యం చేయడమే కావొచ్చని పేర్కొన్నారు.

కాన్సెప్ట్‌ ఇదే..
‘భీమ్‌’ అనేది ప్యానళ్లతో తయారయ్యే మాడ్యులర్‌ అంతరిక్ష నివాసం. చంద్రుడు, అంగారకుడి మిషన్లకు అవసరమైన రోజువారీ పనులను ముందుగా అధ్యయనం చేసి.. ఒక్కో వ్యోమగామికి ఎంత స్థలం అవసరమో లెక్కించారు. ఆ అవసరాలకు అనుగుణంగా వేర్వేరు ఒత్తిడితో కూడిన మాడ్యూళ్లను రూపొందించేలా కాన్సెప్ట్‌ తయారు చేశారు. త్రిభుజం, చతురస్రం, పంచభుజం వంటి సాధారణ ఆకారాల ప్యానళ్లను కలిపి ఈ మాడ్యూళ్లను నిర్మించే విధానాన్ని ప్రతిపాదించారు. తక్కువ బరువుతో రాకెట్‌లో పేర్చుకుని తీసుకెళ్లేలా వీటిని రూపొందించడం దీని ప్రత్యేకత.

‘భీమ్‌’ మాడ్యులర్‌ డిజైన్‌ వల్ల అంతరిక్షంలో నివాసాన్ని సులభంగా ఏర్పాటు చేయడం, అవసరమైతే విస్తరించడం, మరమ్మతులు చేయడం, నిర్వహించడం వీలవుతుంది. ప్రతిపాదించిన మొత్తం నిర్మాణాన్ని స్టార్‌షిప్‌ రాకెట్‌ ఒక్కసారి తీసుకెళ్లే సరకుతోనే ఏర్పాటు చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలా నిర్మించిన నివాసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) కంటే దాదాపు రెండింతల స్థలాన్ని అందించగలదని అంచనా.
Advertisement
Shubhanshu Shukla
BHEEM Space Habitat
Indian Astronaut
Moon Mars Living
Space Exploration India
IISc Bangalore Research

More Telugu News