'టైమ్స్ 100 ఏఐ' జాబితాలో భారత శాస్త్రవేత్త.. ఎవరీ అనిమా ఆనంద్‌కుమార్?

Indian scientist Anima Anandkumar in TIME AI 100 list who is she
  • టైమ్ మ్యాగజైన్ 100 ఏఐ జాబితాలో భారత సంతతి శాస్త్రవేత్త అనిమా ఆనంద్‌కుమార్
  • భౌతిక శాస్త్ర సమస్యల పరిష్కారానికి 'న్యూరల్ ఆపరేటర్స్' టెక్నాలజీ అభివృద్ధి
  • మైసూర్‌లో పుట్టి, ఐఐటీ మద్రాస్‌లో చదివి ప్రపంచ వేదికపై గుర్తింపు
  • ఐక్యరాజ్యసమితి సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డులోనూ సభ్యురాలిగా నియామకం
  • ఎన్విడియా, కాల్‌టెక్‌లలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనిమా
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులకు ప్రముఖ టైమ్ మ్యాగజైన్ అందించే గుర్తింపులో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ అనిమా ఆనంద్‌కుమార్ చోటు దక్కించుకున్నారు. ఏఐ రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా, టైమ్స్ ప్రకటించిన '100 ఏఐ' జాబితాలో ఆమె పేరును చేర్చారు. ఈ ఏడాది మార్చిలోనే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డుకు కూడా ఆమె నియమితులవడం విశేషం.

ఈ గౌరవం పట్ల అనిమా ఆనంద్‌కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో స్పందిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. "గత దశాబ్ద కాలంగా ఏఐ, సైన్స్‌ను అనుసంధానించడమే నా లక్ష్యం. భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, సిమ్యులేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు.

'న్యూరల్ ఆపరేటర్స్' తో నూతన ఆవిష్కరణలు

అనిమా ఆనంద్‌కుమార్ అభివృద్ధి చేసిన "న్యూరల్ ఆపరేటర్స్" అనే టెక్నాలజీ ఆమెకు ఈ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. వాతావరణం, అణు సంలీనం, క్వాంటం కెమిస్ట్రీ వంటి క్లిష్టమైన భౌతిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, వాటిని అనుకరించడానికి ఈ ఏఐ టెక్నాలజీ సహాయపడుతుంది. గతంలో సూపర్ కంప్యూటర్లతో మాత్రమే సాధ్యమయ్యే అనేక శాస్త్రీయ సమస్యలకు ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా పరిష్కారాలు కనుగొంటున్నారు. వాతావరణ అంచనాలు, వైద్య పరికరాల రూపకల్పన, చిప్ మాస్క్ డిజైన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఎన్నో రంగాల్లో దీనిని విజయవంతంగా ఉపయోగిస్తున్నారు.

మైసూర్ నుంచి ప్రపంచ వేదికకు..

కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన అనిమా ఆనంద్‌కుమార్ కుటుంబంలో ఇంజనీర్లు, గణిత శాస్త్రవేత్తలు (తాత), సంస్కృత పండితులు (ముత్తాత) ఉన్నారు. విద్యాపరమైన నేపథ్యంతో పాటు ఆమె చాలా ఏళ్లపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. 2004లో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆమె, అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి 2009లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ తర్వాత ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకురాలిగా పనిచేశారు.

ఆమె తన కెరీర్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్)లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేసి, 'అమెజాన్ సేజ్‌మేకర్' ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించారు. 2017లో కాల్‌టెక్‌లో ప్రొఫెసర్‌గా చేరారు. 2018 నుంచి ఎన్విడియాలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఏఐ రీసెర్చ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపులతో పాటు ఆమె ఐఈఈఈ ఫెలోషిప్, ఆల్ఫ్రెడ్ పి. స్లోన్ ఫెలోషిప్, ఎన్ఎస్ఎఫ్ కెరీర్ అవార్డు వంటి మరెన్నో పురస్కారాలను అందుకున్నారు.
Advertisement
Anima Anandkumar
TIME AI 100
NVIDIA AI Research
Neural Operators AI
Caltech AI Professor
Indian Scientists in AI

More Telugu News