Advertisement

ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా? గూగుల్‌ ఏఐలో కొత్త ఫీచర్లు.. టికెట్‌ నుంచి హోటల్‌ వరకు!

Planning a trip New Google AI features from tickets to hotels
  • గూగుల్‌ ఏఐ మోడ్‌లో ప్రయాణికుల కోసం కొత్త ఫీచర్లు
  • విమాన టికెట్‌ ధరలను ఏఐతో ట్రాక్‌ చేసే అవకాశం
  • ధర మారితే ఈమెయిల్‌ అలర్ట్‌
  • 180కుపైగా దేశాల్లో అందుబాటులోకి ఫ్లైట్‌ ట్రాకింగ్‌
  • మైళ్లు, పాయింట్లతో బుకింగ్‌ వివరాలు
టెక్‌ దిగ్గజం గూగుల్‌ ప్రయాణికుల కోసం తన సెర్చ్‌లోని ఏఐ మోడ్‌కు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన ఈ అప్‌డేట్‌తో విమాన టికెట్ల ధరలను ట్రాక్‌ చేయడం, మైళ్లతో బుకింగ్‌ చేసుకునే అవకాశాలను తెలుసుకోవడం, హోటళ్లను నేరుగా బుక్‌ చేయడం మరింత సులభం కానుంది.

విమాన ప్రయాణానికి సంబంధించిన వివరాలను ఏఐ మోడ్‌లో చెబితే.. 300కు పైగా భాగస్వామ్య ఎయిర్‌లైన్లు, ట్రావెల్‌ సైట్ల నుంచి తాజా ధరలతో ఆప్షన్లను చూపిస్తుంది. ధరలు తగ్గే వరకు వేచి చూడాలనుకుంటే.. అదే సెర్చ్‌లో ధరలను ట్రాక్‌ చేయమని చెప్పొచ్చు. ధరల్లో మార్పు వచ్చినప్పుడు ఈమెయిల్‌ ద్వారా సమాచారం అందుతుంది. ఈ ఫీచర్‌ను 180కుపైగా దేశాలు, ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చారు.

విమాన టికెట్లు, హోటల్‌ గదులను లాయల్టీ పాయింట్లు లేదా మైళ్లతో బుక్‌ చేసుకునేవారికీ ఈ అప్‌డేట్‌ ఉపయోగపడనుంది. నిర్దిష్ట లాయల్టీ ప్రోగ్రామ్‌లలో అందుబాటులో ఉన్న అవార్డు రేట్లను ఏఐ మోడ్‌ చూపిస్తుంది. ప్రస్తుతం అట్మోస్‌ రివార్డ్స్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ అడ్వాంటేజ్‌, చాయిస్‌ ప్రివిలేజెస్‌, హిల్టన్‌ హానర్స్‌, విందమ్‌ రివార్డ్స్‌ వంటి ప్రోగ్రామ్‌లు ఇందులో ఉన్నాయి.

ప్రయాణ తేదీలు, గమ్యం, హోటల్‌ ప్రాధాన్యతలను ఏఐ మోడ్‌కు చెబితే.. అందుబాటులో ఉన్న హోటళ్లను చూపిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ భాగస్వాముల ద్వారా నేరుగా బుకింగ్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌.కామ్‌, ఎక్స్‌పీడియా, హిల్టన్‌, హోటల్స్.కామ్‌, ఐహెచ్‌జీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌, మారియట్‌ ఇంటర్నేషనల్‌, ప్రైస్‌లైన్‌, ట్రిప్‌.కామ్‌, విందమ్‌ హోటల్స్ అండ్‌ రిసార్ట్స్‌ వంటి సంస్థలు ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే బుకింగ్‌ పూర్తయిన తర్వాత రిజర్వేషన్‌కు బాధ్యత సంబంధిత హోటల్‌ లేదా బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌దే.
Advertisement
Google
Google AI travel features
flight price tracking
online hotel booking
travel loyalty points
Google Search AI update

More Telugu News