Advertisement

కర్నూలు వైద్య రంగంలో తొలిసారిగా విజయవంతంగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు: టీజీ భరత్

TG Bharat announces first successful liver and kidney transplants in Kurnool
  • సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించిన గౌరిగోపాల్ హాస్పిటల్, హైదరాబాద్‌లోని టీఎక్స్ ఆసుపత్రి
  • 67 ఏళ్ల అశోక్ కు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స
  • ఇప్పటి వరకు పెద్ద నగరాలకే పరిమితమైన ఇటువంటి ఆపరేషన్లు

కర్నూలు జిల్లా వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని, తొలిసారిగా విజయవంతంగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. గౌరిగోపాల్ హాస్పిటల్, హైదరాబాద్‌లోని టీఎక్స్ (TX) హాస్పిటల్ సంయుక్తంగా, ‘జీవనదాన్ ఆంధ్రప్రదేశ్’ సహకారంతో ఈ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాయని కొనియాడారు.


ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సలలో భాగంగా 67 ఏళ్ల అశోక్‌కు కాలేయ (లివర్) మార్పిడి, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు మూత్రపిండాల (కిడ్నీ) మార్పిడి ఆపరేషన్లను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. అనుభవజ్ఞులైన నిపుణులైన వైద్య బృందం దాదాపు 20 గంటల పాటు నిరంతరం శ్రమించి ఈ ప్రాణరక్షణ ప్రక్రియను పూర్తి చేశారని, ప్రస్తుతం ఇద్దరు రోగులు కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.


ఇంతవరకు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి మహానగరాలకే పరిమితమైన ఇటువంటి అత్యంత క్లిష్టమైన అవయవ మార్పిడి చికిత్సలు ఇప్పుడు కర్నూలులోనే అందుబాటులోకి రావడం రాయలసీమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని టీజీ భరత్ వ్యాఖ్యానించారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి అవయవ దానం చేయడం ద్వారా మరొకరికి పునర్జన్మ నిచ్చారని, వారి మానవతా దృక్పథం ఎంతో అభినందనీయమని చెప్పారు. కర్నూలును వైద్య హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఈ విజయం ప్రజల్లో కొత్త నమ్మకాన్ని, భరోసాను నింపిందని మంత్రి కొనియాడారు.

Advertisement
TG Bharat
Kurnool organ transplants
Liver and kidney surgery
Gauri Gopal Hospital
TX Hospital Hyderabad
Jeevandan Andhra Pradesh

More Telugu News