నల్గొండ ఘటనపై రగులుతున్న రాజకీయం... టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
- నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న దాడి
- బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన రాంచందర్ రావు
- కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి సమీపంలో ఉందన్న టీబీజేపీ చీఫ్
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు నల్గొండ బయల్దేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు యత్నించిన ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి తరలించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నిస్తూ... ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వెళుతుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 రోజుల పాలనలో ప్రజలను తీవ్రంగా దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనానికి అతి సమీపంలో ఉందని జోస్యం చెప్పారు.
ఈ ఘటనతో అటు నల్గొండలోనూ, ఇటు రాజధాని హైదరాబాద్‌లోనూ ఇరు పార్టీల మధ్య ప్రతిఘటనలు తీవ్రరూపం దాల్చాయి. నల్గొండలోని వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు తీవ్రంగా శ్రమించి అడ్డుకున్నారు. నిరసనలు, అరెస్టులతో రెండు పార్టీల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతోంది.