అమరావతిలో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ: కొల్లు రవీంద్ర
- పీవీ సింధు, గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ వంటి వారి అకాడమీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించామన్న రవీంద్ర
- రాష్ట్రంలో 6 ప్రత్యేక అకాడమీలు ప్రారంభించామని వెల్లడి
- ప్రపంచంలో ఏ క్రీడా పోటీలు జరిగినా ఏపీ నుంచి ఒక్కరైనా ప్రాతినిధ్యం వహించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడారంగంలో ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు సభలో పాల్గొన్న మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి... రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోబోతున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు.
భారతదేశానికే ఆదర్శంగా రాజధాని అమరావతిలో 2,500 ఎకరాల విస్తీర్ణంలో భారీ ‘స్పోర్ట్స్ సిటీ’తో పాటు 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. క్రీడలను క్షేత్రస్థాయిలో ప్రోత్సహించడానికి పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, కిదాంబి శ్రీకాంత్ వంటి ప్రముఖ క్రీడాకారుల అకాడమీలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు 6 ప్రత్యేక అకాడమీలను ప్రారంభించామని, ప్రపంచంలో ఏ క్రీడా పోటీలు జరిగినా ఏపీ నుంచి కనీసం ఒక్కరైనా ప్రాతినిధ్యం వహించాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖలో ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో 5 లక్షల మంది పాల్గొని రికార్డు సృష్టించారని గుర్తు చేస్తూ, రాష్ట్రాన్ని ‘హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్’గా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు.
రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రీడా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రాన్ని వైజాగ్, అమరావతి, తిరుపతిగా 3 జోన్లుగా విభజించినట్లు తెలిపారు. క్రీడా పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో 1,000 ఎకరాల్లో ‘స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నామని, మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు సీఎస్ఆర్ నిధులతో జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానాలను అభివృద్ధి చేసి గ్రామీణ యువతకు క్రీడా సదుపాయాలు మెరుగుపరచనున్నట్లు వివరించారు.