రాష్ట్రాన్ని నాశనం చేయడమే జగన్ సంకల్పం: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu says Jagan aim is to destroy Andhra Pradesh
  • జగన్ చేసిన విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలు భరించలేకపోయారన్న రామ్మోహన్ నాయుడు
  • రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వస్తున్నారని విమర్శ
  • ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ కొనసాగించిన విధ్వంసాన్ని భరించలేకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని దారుణంగా ఓడించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే జగన్ ఏకైక సంకల్పమని... అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై ప్రశ్నించే సత్తా లేక కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.


ప్రశ్నించడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు రావడం లేదని రామ్మోహన్ నాయుడు నిలదీశారు. తన పార్టీ నేతలకు ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం, ఉనికిని కాపాడుకోవడం కోసమే ఆయన మాట్లాడుతున్నారని... కానీ, ఆయన చేస్తున్న విమర్శల్లో ఏ ఒక్కదానికి నేటికీ ఆధారాలు చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాకూడదని, ఏ ఒక్కరూ బాగుపడకూడదనే దుర్బుద్ధితోనే జగన్ ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు.


రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కొండంత అండగా ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దానిని ఖచ్చితంగా సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Ram Mohan Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
YSRCP
Chandrababu Naidu
AP Assembly Sessions

More Telugu News