రాఖీ అంటే కేవలం దారం కాదు.. బంధాలకు ప్రతీక: బాలకృష్ణ

Nandamuri Balakrishna says Rakhi is not just a thread but a symbol of bonds
  • తెలుగు ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
  • స్వచ్ఛమైన ప్రేమకు, నమ్మకానికి రాఖీ సజీవ ప్రతీక అని వ్యాఖ్య
  • ప్రతి మనిషిలో మానవత్వాన్ని మేల్కొలిపే సందేశంగా ఈ పండుగ నిలవాలన్న బాలయ్య

పవిత్రమైన రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని ప్రజలందరికీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ అనేది కేవలం చేతికి కట్టే ఒక దారం మాత్రమే కాదని, అది స్వచ్ఛమైన ప్రేమకు, నమ్మకానికి, బాధ్యతకు, జీవితాంతం నిలిచే ఆత్మీయ అనుబంధానికి సజీవ ప్రతీక అని ఆయన అభివర్ణించారు.


ఈ పవిత్ర పర్వదినాన సమాజానికి బాలకృష్ణ ఒక విలక్షణమైన సందేశాన్ని ఇచ్చారు. నేటి ఆధునిక సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, అత్యంత భద్రంగా జీవించగలిగే అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని చెప్పారు. కుటుంబ బంధాలను నిరంతరం ప్రేమతో, పరస్పర గౌరవంతో కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


రక్షా బంధన్ అసలైన స్ఫూర్తి కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికే పరిమితం కాకూడదని బాలయ్య ఆకాంక్షించారు. ప్రతి మహిళను మనస్ఫూర్తిగా గౌరవించే సంస్కృతిగా, ప్రతి కుటుంబాన్ని ఏకం చేసే గొప్ప విలువగా, ప్రతి మనిషిలో మానవత్వాన్ని మేల్కొలిపే సందేశంగా ఈ పండుగ నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పావన పర్వదినం తెలుగువారి ప్రతి ఇంట అమితమైన ఆనందాన్ని, ప్రతి హృదయంలో కొండంత ప్రేమను, ప్రతి కుటుంబంలో ఐక్యతను నింపాలని మనసారా కోరుకుంటున్నట్టు బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement
Nandamuri Balakrishna
Raksha Bandhan
Rakhi Wishes
Women Safety
Hindupur MLA
Family Values

More Telugu News