మహిళలపై ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టను: కొండా సురేఖ ఎపిసోడ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
- మహిళల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్న అనిరుధ్ రెడ్డి
- కొండా సురేఖ గురించి బహిరంగంగా మాట్లాడొద్దని సీఎం ఆదేశించారని వెల్లడి
- క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న అనిరుధ్
తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, మహిళలపై తాను ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టనని ఆయన స్పష్టం చేశారు. సొంత తల్లి తిట్టినా సరే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతానని, మహిళలు తిట్టారని భావించి వారిని తిరిగి విమర్శిస్తే సమాజంలోని మహిళలంతా మనపై రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
మహిళలు కన్నీళ్లు పెట్టుకుని వారి కంటి నుంచి ఒక్క చుక్క నీరు భూమిపై పడినా, ఆ కన్నీటి చుక్క సునామీగా మారి మనల్ని కొట్టుకుపోయేలా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే వారిపై మీడియా ముందు మాట్లాడే ప్రసక్తే లేదని, ఒకవేళ తనను ఎవరైనా తిట్టినా వాటిని అక్షింతలుగానే స్వీకరిస్తానని తెలిపారు. ఇక కొండా సురేఖ వివాదంపై పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు.
ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సుదీర్ఘంగా విచారణ జరుపుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ లేదా సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేశారనేది దేవుడు చూస్తున్నాడని, క్రమశిక్షణ కమిటీ ఇచ్చే తుది నివేదికను తాము శిరసావహిస్తామన్నారు. ఇదే సమయంలో తన నియోజకవర్గ అభివృద్ధికి రావాల్సిన నిధుల కోసం గట్టిగా పోరాడతానని, అవసరమైతే ప్రజల సంక్షేమం కోసం దీక్షలైనా చేస్తానని తెలిపారు.