నేపాల్ విపత్తుకు భూకంపం కారణం కాదు.. షాకింగ్ విషయాలను వెల్లడించిన ఇస్రో

ISRO explains Himalayan glacier collapse led to Nepal flash floods
  • హిమాలయాల్లో నిటారుగా ఉన్న ఒక భారీ గ్లేసియర్ కూలిపోవడమే విపత్తుకు కారణమని ఇస్రో వెల్లడి
  • విరిగిపడిన మంచు, రాళ్లు 'లేందే' నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయన్న ఇస్రో
  • నది ప్రవాహ ఒత్తిడికి ఆ అడ్డంకి బద్దలవడంతో దిగువ గ్రామాలను వరద ముంచెత్తిందని వెల్లడి

నేపాల్‌లోని రసువా సరిహద్దు ప్రాంతాన్ని ముంచెత్తిన విధ్వంసకర ఆకస్మిక వరదలకు (ఫ్లాష్ ఫ్లడ్స్) అసలు కారణమేంటో ఉపగ్రహ ఆధారిత అధ్యయనాల ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ శోకసంద్రానికి కారణం భూకంపం కాదని, హిమాలయాల్లో నిటారుగా ఉన్న ‘గ్లేసియర్’ (మంచు కొండ) ఒక్కసారిగా కూలిపోవడమేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.


భారత కాలమానం ప్రకారం శాటిలైట్ డేటాను విశ్లేషించిన ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)... ప్రమాదానికి ముందు, ఆ తర్వాత ఇస్రో ‘రిసోర్స్‌శాట్-2ఏ’ మరియు ‘సెంటినెల్-2’ ఉపగ్రహాలు తీసిన చిత్రాలను పోల్చి చూసి ఈ నిజాలను బయటపెట్టింది. టిబెట్-నేపాల్ సరిహద్దుకు ఎగువన ఉన్న హిమానీనదం సుమారు మూడింట రెండు వంతులు ఒక్కసారిగా విరిగిపడటంతో తీవ్రమైన 'ఐస్-రాక్ అవలాంచ్' కిందకు దూసుకొచ్చింది. ఇలా విరిగిపడిన మంచు, రాళ్లు 'లేందే' నది ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకోవడంతో అక్కడ అకస్మాత్తుగా నీరు నిలిచిపోయి భారీ కృత్రిమ సరస్సులా మారింది.


ఆ తర్వాత ప్రవాహ ఒత్తిడికి తాత్కాలికంగా ఏర్పడిన అడ్డంకి ఒక్కసారిగా బద్దలవడంతో భారీ ఎత్తున మట్టి, రాళ్లు, వరద నీరు ఊహించని వేగంతో లేందే, భోటేకోశి నదుల్లోకి ఉప్పెనలా ఎగసిపడ్డాయి. ఈ సంఘటనను మొదట్లో 4.4 లేదా 4.9 తీవ్రతతో కూడిన భూకంపంగా భావించినప్పటికీ, యుఎస్ జియోలాజికల్ సర్వే, ఇస్రో శాస్త్రవేత్తలు అసలు నిజం వెల్లడించారు. అసలు భూకంపమే రాలేదని, వేల టన్నుల మంచు పర్వతం ఒక్కసారిగా విరిగి కింద పడిన తీవ్రత వల్లే భూమిలో 5.2 తీవ్రతకు సమానమైన ప్రకంపనలు నమోదయ్యాయని వివరించారు.


ఈ ఘటనతో భోటేకోశి నదిలో ప్రవాహం అపారంగా పెరిగి చుట్టుపక్కల గ్రామాలు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులను ముంచెత్తింది. ఇప్పటివరకు ఈ ఘోర విపత్తులో 160 మందికి పైగా మరణించగా, వందలాది మంది గల్లంతయ్యారు. ప్రకృతి విపత్తుల తీరును అర్థం చేసుకోవడంలో అంతరిక్ష సాంకేతికత ఎంత కీలకంగా మారిందో ఈ ఇస్రో ఉపగ్రహ విశ్లేషణ మరొకసారి రుజువు చేసింది.

Advertisement
ISRO
Nepal Floods
Glacier Collapse
Himalayan Avalanche
NRSC Satellite Analysis
Nepal Disaster Reason

More Telugu News