తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసు: అచ్చెన్నాయుడు
- క్రిమినల్స్ అంటే అందరూ భయపడతారన్న అచ్చెన్నాయుడు
- క్రిమినల్స్ రాజకీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నామని వ్యాఖ్య
- బలహీనవర్గాలను జగన్ బాధితులుగా మార్చేశారని మండిపాటు
సమాజంలో క్రిమినల్స్‌కు అందరూ భయపడతారని, వారు చేసే పనులు సమాజానికి ఎంతో హానికరమని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి రాజకీయం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
క్రిమినల్స్ తాము చేసిన తప్పులను ఇతరులపైకి తోసేసి, చివరికి తామే బాధితులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తారని మంత్రి మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో ప్రజలందరికీ బాగా తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు.
బలహీన వర్గాలను అడ్డుపెట్టుకుని, వారి మెడపై కత్తి పెట్టి మరీ వేధింపులకు గురిచేశారని మంత్రి విమర్శించారు. గొడ్డలి పార్టీ అధినేత జగన్ ఆర్థికంగా విపరీతంగా బలపడ్డారని, కానీ బలహీన వర్గాలను మాత్రం బాధితులుగా మార్చేశారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు వ్యవహారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
అలాగే మాజీ మంత్రి జోగి రమేశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... "జోగి రమేశ్.. నీ కుటుంబ వ్యవహారంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు గానీ, మంత్రి లోకేశ్ కు గానీ ఏం సంబంధం? మీలాంటి నీచ చరిత్ర చంద్రబాబుకు, లోకేశ్ కు లేదు. ముందు ఆ విషయాన్ని తెలుసుకోవాలి" అని హితవు పలికారు. 2014 నుంచి 2019 వరకు సాగిన తెలుగుదేశం పాలనే రాష్ట్రంలోని బీసీలకు నిజమైన స్వర్ణయుగమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.