'గ్రేట్ గ్రీన్ వాల్' కార్యక్రమంలో భాగంగా తాటి వనాలను పెంచే కార్యక్రమం ప్రారంభమైంది: పవన్ కల్యాణ్
- తీరప్రాంతం వెంబడి 5,499 హెక్టార్లలో తాటి వానాలను ఏర్పాటు చేస్తున్నామన్న పవన్
- తుపాన్లు సంభవించినప్పుడు తీరప్రాంత గ్రామాలకు రక్షణ గోడలా పనిచేస్తాయని వెల్లడి
- కఠిన తీరప్రాంత వాతావరణాన్ని తట్టుకునే శక్తి తాటిచెట్లకు ఉందని వ్యాఖ్య
రాష్ట్రంలోని సుదీర్ఘ తీరప్రాంతానికి సహజమైన రక్షణ కవచాన్ని ఏర్పరచేందుకు ‘గ్రేట్ గ్రీన్ వాల్’ ప్రాజెక్టులో భాగంగా తాటివనాలను పెంచే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. తీరప్రాంతం వెంబడి సుమారు 5,499 హెక్టార్ల పరిధిలో ఈ తాటి వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతం తాటికాయల సీజన్ నడుస్తుండటంతో, అటవీశాఖ ద్వారా తాటి గింజలను సేకరించి తీరప్రాంతాల్లో నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి విపత్తులు, తుపాన్లు సంభవించినప్పుడు ఉగ్రరూపం దాల్చే ఈదురుగాలుల నుంచి తీరప్రాంత గ్రామాలకు ఈ తాటివనాలు ఒక సహజ రక్షణ గోడలా పనిచేస్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు.
తీరప్రాంతాల్లో ప్రత్యేకంగా తాటిచెట్లనే ఎంచుకోవడానికి గల కారణాలను వివరిస్తూ... ఉప్పునీరు, హోరు గాలులు ఉండే కఠినమైన తీరప్రాంత వాతావరణాన్ని తట్టుకుని నిలబడే శక్తి తాటిచెట్లకు మాత్రమే ఉంటుందన్నారు. ఇసుక, బుసక, ఉప్పు నేలలతో పాటు ఒండ్రు నేలల్లో సైతం ఇవి పెరుగుతాయని పేర్కొన్నారు. తాటిచెట్లు బాగా ఎత్తుగా పెరిగే లక్షణం కలిగి ఉండటం వల్ల సముద్ర గాలులను సమర్థవంతంగా అడ్డుకుంటాయని, అంతేకాకుండా వీటి వేర్లు నేలను బలంగా పట్టి ఉంచడం ద్వారా తీరం కోతకు గురికాకుండా కాపాడుతాయని ఉపముఖ్యమంత్రి వివరించారు.