ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరికలు.. వెనక్కి తగ్గిన ఎఫ్ఎస్ఎస్ఏఐ

FSSAI backs down on packaged food warning labels
  • ప్యాకేజ్డ్ ఫుడ్‌పై హెచ్చరిక లేబుళ్ల ప్రతిపాదనను విరమించుకున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • ఆహార కంపెనీల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడితో వెనక్కి తగ్గిన సంస్థ
  • విదేశాల్లో ఒక విధానం, భారత్‌లో మరో విధానం పాటిస్తున్న కంపెనీలు
  • ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై ముద్రించే హెచ్చరిక లేబుళ్ల విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వెనక్కి తగ్గింది. అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో ఎరుపు రంగుతో కూడిన స్పష్టమైన హెచ్చరిక గుర్తులను ముద్రించాలన్న తన ప్రతిపాదనను విరమించుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ ఏడాది మార్చిలో ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో జరిగిన సమావేశంలో, కోకా కోలా వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు రంగుల హెచ్చరిక లేబుళ్ల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ లేబుళ్లు గందరగోళానికి దారితీస్తాయని, వాటివల్ల ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పు రాదని వారు వాదించారు. కేవలం చిహ్నాలను చూసి ప్రజల ఆహార అలవాట్లు మారతాయని భావించడం సరైంది కాదని కోకా కోలా ఇండియాకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ, 'కలర్' హెచ్చరికల ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కేవలం చక్కెర, కొవ్వు, ఉప్పు శాతాలను తెలిపే నలుపు-తెలుపు పట్టికను ప్యాకెట్ల ముందు భాగంలో ఉంచాలని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ఆగస్టులో సుప్రీంకోర్టుకు విన్నవించింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రజారోగ్య కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఎఫ్ఎస్ఎస్ఏఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. "భారతీయుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి" అని ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఐరోపా, బ్రిటన్ వంటి దేశాల్లో కోకా-కోలా, నెస్లే వంటి కంపెనీలు స్వచ్ఛందంగా స్పష్టమైన ట్రాఫిక్-లైట్ లేబుళ్లను ఉపయోగిస్తున్నాయి. కానీ, భారత్‌లో మాత్రం ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా, విదేశాల్లో విక్రయించే ఉత్పత్తులతో పోలిస్తే, భారత్‌లో అమ్మే ఫాంటా వంటి పానీయాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం, కిట్‌క్యాట్, మ్యాగీ వంటి ఉత్పత్తుల నాణ్యతలో వ్యత్యాసాలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించే తుది నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Advertisement
FSSAI
Packaged Food Warning Labels
Supreme Court of India
Coca Cola India
Food Safety Standards

More Telugu News