రేవంత్‌కు క్షమాపణ చెప్పాల్సిందే: కొండా సురేఖకు ఎమ్మెల్యేల అల్టిమేటం

Konda Surekha must apologize to Revanth Reddy say Congress MLAs
  • సీఎం రేవంత్‌పై మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో దుమారం
  • కూతురి మాటలతో తనకు సంబంధం లేదన్న మంత్రి కొండా సురేఖ
  • సురేఖను కేబినెట్ నుంచి తొలగించాలని 20 మందికి పైగా ఎమ్మెల్యేల డిమాండ్
  • సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గట్టిగా పట్టుబట్టిన శాసనసభ్యులు
  • విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదం మరింత ముదిరింది. సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని, ఆమె సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులతో సీఎంపై విమర్శలు చేయించడం సంస్కార హీనమని, కూతురి వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడం కేవలం బుకాయింపు మాత్రమేనని వారు విమర్శించారు.

ఇటీవల గీసుకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో కొండా సుస్మిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం మంత్రి సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి సురేఖ వివరణ ఇస్తూ, తన కూతురి వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి రాజకీయంగా తాను బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తనపై జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు.

అయితే, సురేఖ వివరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం వేదికగా సమావేశమై, సురేఖపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడటం సరికాదని, సురేఖ వెంటనే తన కుమార్తె వ్యాఖ్యలను ఖండించి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. సీనియర్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. సుస్మిత వ్యాఖ్యలు పార్టీ నిబంధనలను అతిక్రమించాయని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మల్లు రవి కూడా సుస్మిత వ్యాఖ్యలు అనుచితమని, మంత్రిగా ఉన్న సురేఖ వాటిని ఖండించకపోవడం తప్పని అన్నారు. శనివారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ.. సురేఖ వివరణ, వీడియో ఫుటేజీలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోకుండా మరిన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. 
Advertisement
Konda Surekha
Revanth Reddy
Telangana Congress
Konda Susmitha
TPCC
Congress MLAs Ultimatum

More Telugu News