3 అంగుళాలు తగ్గిన పిజ్జా.. కంపెనీకి రూ.10,520 జరిమానా!

Consumer Court fines company 10520 for delivering 3 inch smaller pizza
  • 10 అంగుళాల పిజ్జా ఆర్డర్‌.. 7 అంగుళాలే డెలివరీ
  • రిఫండ్‌ నిరాకరించడంతో కమిషన్‌ను ఆశ్రయించిన కస్టమర్‌
  • పిజ్జా ధర, డెలివరీ ఛార్జీలు కలిపి రూ.520 చెల్లించాలని ఆదేశం
  • వేధింపులకు రూ.5,000 పరిహారం ఇవ్వాలని తీర్పు
  • కేసు ఖర్చులతో కలిపి మొత్తం రూ.10,520 చెల్లించాలని ఆదేశం
10 అంగుళాల పిజ్జాకు ఆర్డర్‌ ఇచ్చాడు. కానీ ఇంటికి చేరింది మాత్రం 7 అంగుళాల పిజ్జా. సైజు మూడు అంగుళాలు తగ్గిందని వినియోగదారుడు వదిలిపెట్టలేదు. రిఫండ్‌ కోసం పోరాడాడు. చివరికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఇప్పుడు ఆ పిజ్జా ధర కంటే 20 రెట్లు ఎక్కువ పరిహారం పొందాడు.

ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా రూ.505 విలువైన 10 అంగుళాల పిజ్జాను ఓ వినియోగదారుడు ఆర్డర్‌ చేశాడు. డెలివరీ వచ్చిన తర్వాత సైజు చూసి ఆశ్చర్యపోయాడు. అది కేవలం 7 అంగుళాల పిజ్జా అని తేలింది.

దీనిపై వెంటనే ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ కస్టమర్‌ సపోర్ట్‌ను సంప్రదించాడు. రిఫండ్‌ ఇవ్వాలని కోరాడు. కానీ అతడి అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌, సీపీజీఆర్‌ఏఎంఎస్‌ పోర్టల్‌ను ఆశ్రయించాడు. లీగల్‌ నోటీసు కూడా పంపించాడు. ఫలితం లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.

విచారణ జరిపిన కమిషన్‌.. వినియోగదారుడు ఆర్డర్‌ చేసిన వస్తువు కాకుండా వేరే సైజు పిజ్జాను పంపడం సేవల్లో లోపమని తేల్చింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతేనని పేర్కొంది.

ఫుడ్‌ డెలివరీ సంస్థ, రెస్టారెంట్‌ కలిసి వినియోగదారుడికి రూ.10,520 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిజ్జా ధర రూ.505, డెలివరీ ఛార్జీలు రూ.15 ఉన్నాయి. మానసిక, శారీరక వేధింపులకు రూ.5,000 పరిహారం చెల్లించాలని చెప్పింది. కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.

తాము కేవలం రెస్టారెంట్లు, వినియోగదారుల మధ్య మధ్యవర్తులమని ఫుడ్‌ డెలివరీ సంస్థ వాదించింది. అయితే ఆ వాదనను కమిషన్‌ తోసిపుచ్చింది. ఆర్డర్‌లో చూపించిన సైజుకు, డెలివరీ చేసిన పిజ్జాకు తేడా ఉంటే బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది.
Advertisement
Consumer Court
Pizza Refund Case
Uttarakhand News
Online Food Delivery
Consumer Protection
Pizza Size Dispute

More Telugu News