లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్.. అర్హత సడలింపు

Supreme Court good news for law graduates eligibility relaxed
  • జడ్జి పరీక్షలకు మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధన సడలింపు
  • ఇకపై ఏడాది అనుభవంతోనే పరీక్షకు హాజరయ్యే అవకాశం
  • 2:1 మెజారిటీతో సుప్రీంకోర్టు కీలక తీర్పు
  • ఎంపికైన వారికి రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ, క్లర్క్‌షిప్
  • 2027 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన పూర్తిస్థాయిలో అమలు
జ్యుడీషియల్ సర్వీసెస్ (న్యాయమూర్తుల నియామక) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అర్హత విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. న్యాయవాదిగా కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనను సడలించిన ధర్మాసనం, ఇకపై ఏడాది పాటు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏజీ మసీహ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం 2:1 మెజారిటీతో ఈ తీర్పును వెలువరించింది. అయితే, జస్టిస్ వినోద్ చంద్రన్ ఈ తీర్పుతో విభేదించారు.

గతంలో 2025 మే నెలలో ఇచ్చిన తీర్పు ప్రకారం, జడ్జి పరీక్ష రాయాలంటే లా గ్రాడ్యుయేట్లకు మూడేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ ఉండటం తప్పనిసరి. తాజా తీర్పుతో ఈ నిబంధన మారింది. ఇకపై ఏడాది అనుభవం ఉన్నవారు ప్రిలిమినరీ స్థాయి జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే, ప్రవేశ నిబంధనలను సడలించినప్పటికీ, ఎంపికైన అభ్యర్థులకు కఠినమైన శిక్షణ ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. పరీక్షలో ఎంపికైన వారు రెండేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ, పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఏడాది పాటు జ్యుడీషియల్ అకాడమీలో సమగ్ర శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు క్లర్క్‌షిప్‌ చేయాలి. దీనిలో మొదటి ఆరు నెలలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్/జిల్లా సెషన్స్ జడ్జి వద్ద, తర్వాతి ఆరు నెలలు హైకోర్టు జడ్జి వద్ద పనిచేయాల్సి ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో వారి పనితీరును అంచనా వేసిన తర్వాతే తుది నియామకాన్ని ఖరారు చేస్తారు.

2025 నాటి తీర్పు వెలువడి ఇప్పటికే ఏడాది పూర్తయినందున, ఇటీవలి లా గ్రాడ్యుయేట్లు ఏడాది ప్రాక్టీస్ పూర్తి చేసినట్లుగానే భావిస్తామని, దీని కోసం ప్రత్యేక సర్టిఫికెట్ అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయితే, 2027 ఏప్రిల్ 1 నుంచి వెలువడే సివిల్ జడ్జి (జూనియర్ జడ్జి) నోటిఫికేషన్లకు మాత్రం ఏడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఈ నూతన విధానం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత దీనిని సమీక్షిస్తామని ధర్మాసనం వెల్లడించింది.                                
Advertisement
Supreme Court of India
Law graduates eligibility
Judicial Services exam
Civil Judge recruitment
Advocate practice rules
Supreme Court latest judgment

More Telugu News