'స్పిరిట్' వివాదం.. ఒక్క 'లైక్'తో వంగా బ్ర‌ద‌ర్స్‌కు దీపిక పదుకొణె స్ట్రాంగ్ రిప్లై

Deepika Padukone gives strong reply to Vanga brothers with a single like
  • ప్రభాస్ 'స్పిరిట్' మూవీ వివాదంపై స్పందించిన దీపిక పదుకొణె
  • తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ రాసిన పోస్ట్‌కు లైక్ కొట్టిన నటి
  • లాభాల్లో వాటా అడగడం, స్క్రిప్ట్ లీక్ చేశారన్న నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా
  • ఇది మగ అహంకారానికి నిదర్శనమంటూ దీపిక మద్దతు తెలిపిన పోస్ట్
  • హీరోలు చేస్తే తప్పులేదు, ఆడవాళ్లు అడిగితే తప్పా అని ప్రశ్నించిన జర్నలిస్ట్
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం 'స్పిరిట్' చుట్టూ అలుముకున్న వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంపై నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఆరోపణలకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె పరోక్షంగా, కానీ చాలా బలంగా స్పందించారు. వంగా సోదరులను విమర్శిస్తూ రాసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను 'లైక్' చేయడం ద్వారా ఆమె తన వైఖరిని స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. దీపిక ఈ సినిమా లాభాల్లో 10 శాతం వాటా అడిగారని, డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా చర్చలు విఫలమయ్యాక సినిమా కథ, పాత్రకు సంబంధించిన అంతర్గత విషయాలను ఆమె లీక్ చేశారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా తమకు వర్కవుట్ కాకపోవడం వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించాల్సి వచ్చిందని వివరించారు.

ఈ ఆరోపణలపై దీపిక నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, ఓ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్‌కు ఆమె మద్దతు తెలిపారు. "దీపిక 10% లాభం అడిగితే, మొత్తం వంగా ఆస్తిని అడిగినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఇది స్పష్టంగా మగ అహంకార సంక్షోభం. ఒక మహిళ 'నో' చెప్పడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు" అని ఆ పోస్ట్‌లో జర్నలిస్ట్ పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి మగ స్టార్లు లాభాల్లో వాటాలు, అనుకూలమైన పని గంటలు వంటివి డిమాండ్ చేస్తున్నారని, అలా చేస్తే వారిని 'క్రమశిక్షణ' గలవారని అంటారని, అదే ఒక మహిళా స్టార్ అడిగితే 'ఇబ్బంది పెట్టే వ్యక్తి'గా ముద్ర వేస్తారని ఆ పోస్ట్ విమర్శించారు. ఒప్పందం రద్దయి నెలలు గడుస్తున్నా వంగా సోదరులు ఇంకా ఆమె గురించే మాట్లాడటం వృత్తి నైపుణ్యం కాదని, ఇది పూర్తిగా లింగ వివక్ష, మగ అహంకారమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. "ఆమె నో చెప్పింది. దాన్ని అంగీకరించి ముందుకు సాగండి" అంటూ పోస్ట్‌లో జర్నలిస్ట్ రాసుకొచ్చారు. 

మొత్తానికి దీపిక నేరుగా స్పందించకపోయినా తన మద్దతు ద్వారా ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం రెమ్యూనరేషన్, డేట్స్ సమస్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో లింగ సమానత్వం, మగ అహంకారంపై తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement
Deepika Padukone
Sandeep Reddy Vanga
Pranay Reddy Vanga
Spirit Movie
Prabhas Spirit
Deepika Padukone Spirit Controversy

More Telugu News