చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు: ఎంపీ శ్రీభరత్
- ప్రత్యక్ష పద్ధతిలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలనే నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీభరత్
- స్థానిక ఎన్నికల్లో కూటమి పక్షాలు ఘన విజయం సాధిస్తాయని ధీమా
- ఎల్‌నినో ప్రభావం వల్లే నీటి సమస్యలు తలెత్తుతున్నాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని విశాఖపట్నం టీడీపీ ఎంపీ శ్రీభరత్ స్వాగతించారు. విశాఖపట్నం ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక ప్రాంతీయ నీటి ఎద్దడి అంశంపై స్పందిస్తూ... ఎల్‌నినో ప్రభావం వల్లే తాగునీటి ఎద్దడి సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. నీటి కొరతను ఆసరాగా చేసుకుని రాబోయే డేటా సెంటర్ల వల్ల నీటి సమస్యలు వస్తున్నాయంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్లు ఏర్పాటు కావడానికి ఇంకా రెండేళ్ల సమయం పడుతుందని వివరించారు. కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పోలవరం నీటిని విశాఖపట్నానికి తరలించే ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయని, భవిష్యత్తులో నదుల అనుసంధానం పూర్తయితే దక్షిణ భారతదేశంలో నీటి సమస్య పూర్తిగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.