నా కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం: క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ
- రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కూతురు సుస్మిత అనుచిత వ్యాఖ్యలు
- కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ
- కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన సురేఖ
సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గంపై తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ, హైదరాబాద్‌లోని కమిటీ ఎదుట హాజరై ఈ మేరకు తన వివరణను సమర్పించారు.
తన కుమార్తె అయినంత మాత్రాన ఆమె వ్యక్తం చేసిన రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయడం సముచితం కాదని, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఈ సందర్భంగా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, పీసీసీ నాయకత్వం, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణమైన గౌరవం, విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని... ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.