మోహన్‌ భగవత్‌కు దౌత్య మర్యాదలు వద్దు.. అమెరికా కమిషన్‌ సంచలన వ్యాఖ్యలు

US Commission demands sanctions on RSS
  • ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధించాలని యూఎస్సీఐఆర్‌ఎఫ్‌ డిమాండ్‌
  • మోహన్‌ భగవత్‌ అమెరికా పర్యటనకు ముందు ప్రతిపాదన
  • ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు దౌత్య మర్యాదలు వద్దన్న కమిషన్‌
  • మత స్వేచ్ఛ ఉల్లంఘనలపై ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలు
  • గతంలోనూ భారత్‌పై యూఎస్సీఐఆర్‌ఎఫ్‌ తీవ్ర నివేదిక
ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆంక్షలు విధించాలని అమెరికాకు చెందిన మత స్వేచ్ఛల కమిషన్‌ (యూఎస్సీఐఆర్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఈ నెల 29న న్యూయార్క్‌ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భగవత్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు అమెరికా ప్రభుత్వం ఉన్నత స్థాయి దౌత్య మర్యాదలు ఇవ్వొద్దని కమిషన్‌ సభ్యులు కోరారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అనుబంధ సంస్థలు భారత్‌లో మైనారిటీలపై దాడులకు  పాల్పడ్డాయని యూఎస్సీఐఆర్‌ఎఫ్‌ ఛైర్మన్‌ ఆసిఫ్‌ మహమూద్‌ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్ఎస్ఎస్ సభ్యుడేనని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై ఆంక్షలు విధించాలని కమిషనర్‌ జీన్‌ మిల్స్‌ సూచించారు. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు బాధ్యులైన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. మార్చిలో విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన యూఎస్సీఐఆర్‌ఎఫ్‌.. ఆర్‌ఎస్‌ఎస్‌, రా వంటి సంస్థలపై ఆంక్షలు విధించాలని సిఫార్సు చేసింది.

అయితే యూఎస్సీఐఆర్‌ఎఫ్‌ ఆరోపణలను భారత్‌ గతంలోనే ఖండించింది. భారత్‌పై వక్రీకరించిన, ఏకపక్ష చిత్రాన్ని ఆ సంస్థ చూపుతోందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అనుమానాస్పద వర్గాలు, భావజాల కథనాల ఆధారంగా యూఎస్సీఐఆర్‌ఎఫ్‌ నివేదికలు తయారవుతున్నాయని విమర్శించింది. భారత బహుళత్వ సమాజంపై తప్పుడు ముద్ర వేసేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మండిపడ్డారు. అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు, భారతీయులపై పెరుగుతున్న అసహనాన్ని ముందుగా పరిశీలించాలని సూచించారు.
Advertisement
RSS
Mohan Bhagwat
USCIRF
US Sanctions
India Foreign Ministry
Religious Freedom

More Telugu News