27 ఏళ్లుగా అమెరికాలోనే నివాసం.. గ్రీన్ కార్డ్ ఉన్న తెలుగు సంతతి వృద్ధురాలిని నిర్బంధించిన ఐసీఈ

Venkata Narasamamba Vasamsetti Green Card holder of Telugu origin detained by ICE in US
  • 2022లో అనారోగ్యంతో ఉన్న తండ్రిని పరామర్శించేందుకు ఇండియాకు వచ్చిన నరసమాంబ వాసంశెట్టి
  • అదే సమయంలో కోవిడ్ బారిన పడిన వైనం
  • 7 నెలలు ఇక్కడే ఉండటంతో అమెరికా శాశ్వత నివాస హక్కును వదులుకున్నారంటూ ఐసీఈ కేసు
  • 2013 నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్ గా ఉన్న నరసమాంబ

అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా చట్టబద్ధంగా నివాసముంటూ, గ్రీన్ కార్డ్ కలిగిన భారత సంతతికి (తెలుగు) చెందిన వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే వృద్ధురాలిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు హఠాత్తుగా నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమె డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) కేసుకు సంబంధించి గతంలోనే ఇమ్మిగ్రేషన్ కోర్టు అనుకూల తీర్పు ఇచ్చినప్పటికీ, షెడ్యూల్డ్ చెకింగ్ సమయంలో అధికారులు ఆమెను అరెస్టు చేసి జార్జియాలోని నిర్బంధ కేంద్రానికి తరలించడం తీవ్ర సంచలనంగా మారింది.


నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న వెంకట నరసమాంబ వాసంశెట్టి, 2013 నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్‌గా ఉన్నారు. 2022లో తన అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని పరామర్శించేందుకు భారత్‌కు వచ్చిన ఆమె, కోవిడ్ బారిన పడటంతో దాదాపు 7 నెలల పాటు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే, ఆమె అమెరికా శాశ్వత నివాస హక్కును వదులుకున్నారనే ఆరోపణలతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) కేసు నమోదు చేసింది. కానీ, తగిన ఆధారాలు చూపించకపోవడంతో 2026 మేలో ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆ కేసును కొట్టివేశారు.


కోర్టు కేసు కొట్టివేసినప్పటికీ, క్రమం తప్పకుండా ఐసీఈ చెకప్‌లకు హాజరవుతున్న వెంకట నరసమాంబను ఆగస్టు 11న నిర్వహించిన తనిఖీల్లో అధికారులు నిర్బంధించారు. ఎటువంటి నేర చరిత్ర లేని వృద్ధురాలిని చట్టవిరుద్ధంగా బంధించారని, ఆమె కుటుంబం అత్యవసర ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేయగా, ఆమెను ఏ చట్టబద్ధమైన ప్రాతిపదికన నిర్బంధించారో 3 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఫెడరల్ జడ్జి ఐసీఈ అధికారులను ఆదేశించారు.

Advertisement
Venkata Narasamamba Vasamsetti
ICE detention
Indian Green Card holder
US immigration news
North Carolina teacher
Illegal detention

More Telugu News