ఈ 6 అలవాట్లు కిడ్నీలను నెమ్మదిగా దెబ్బతీస్తాయి!

Kidneys 6 habits that can slowly damage your renal health
  • కిడ్నీ వ్యాధుల్లో లక్షణాలు వెంటనే బయటపడని వైనం
  • పెయిన్‌కిల్లర్లను తరచూ వాడటం ప్రమాదకరం
  • ప్యాకెట్‌ ఫుడ్‌లో దాగిన ఉప్పుతో ముప్పు
  • ప్రాసెస్డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడం మంచిది కాదు
  • స్మోకింగ్‌తో కిడ్నీలకూ ముప్పు
కిడ్నీల్లో సమస్య మొదలైన వెంటనే లక్షణాలు కనిపించవు. నొప్పి లేకపోవడంతో అంతా బాగానే ఉందని చాలామంది అనుకుంటారు. కానీ రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లు కిడ్నీలపై క్రమంగా ఒత్తిడి పెంచొచ్చు. ముఖ్యంగా నొప్పి మందులను తరచుగా వాడటం, ఎక్కువ ఉప్పు తినడం, పొగతాగడం వంటి అలవాట్లపై జాగ్రత్త అవసరం. నిపుణుల సూచనల ప్రకారం కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్న ఆరు అలవాట్లు ఏంటో చూద్దాం..

నొప్పి వస్తే వెంటనే మందులు
తలనొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పి వచ్చిన ప్రతిసారీ పెయిన్‌కిల్లర్‌ వేసుకోవడం మంచిది కాదు. వైద్యుల సూచన లేకుండా వాడితే కిడ్నీలకు రక్తప్రసరణ తగ్గొచ్చు. తీవ్రమైన సందర్భాల్లో కిడ్నీ పనితీరు ఒక్కసారిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా డీహైడ్రేషన్‌, వాంతులు, విరేచనాలు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.

ఉప్పుతో ముప్పు
ఉప్పు అంటే వంటలో వేసేదే అనుకోవద్దు. ప్యాకెట్‌ స్నాక్స్‌, పచ్చళ్లు, సాస్‌లు, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, హోటల్‌ వంటకాల్లోనూ సోడియం ఎక్కువగా ఉండొచ్చు. అధిక సోడియం శరీరంలో నీటిని నిల్వ చేయొచ్చు. రక్తపోటును పెంచొచ్చు. దీర్ఘకాలంలో కిడ్నీలపై ప్రభావం పడొచ్చు.

ప్యాకెట్‌ ఫుడ్‌ తినడం
అప్పుడప్పుడు రెడీమేడ్‌ ఫుడ్‌ తినడం పెద్ద సమస్య కాదు. కానీ ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌, చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ రోజువారీ ఆహారంలో ప్రధానంగా మారితే ఇబ్బంది. వీటిలో ఉప్పు, క్యాలరీలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండొచ్చు. దీర్ఘకాలంలో అధిక బరువు, ఇన్సులిన్‌ నిరోధకత, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీయొచ్చు.

నీళ్లు ఎక్కువ తాగితే
కిడ్నీలకు తగినంత నీరు అవసరం. ముఖ్యంగా ఎండ, వ్యాయామం, జ్వరం, వాంతులు, విరేచనాల సమయంలో డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలి. అయితే అవసరానికి మించి రోజూ లీటర్ల కొద్దీ నీరు తాగడం కూడా సరైన పద్ధతి కాదు. శరీర పరిమాణం, వాతావరణం, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితిని బట్టి నీటి అవసరం మారుతుంది.

పొగతాగడం కేవలం ఊపిరితిత్తులకే కాదు
స్మోకింగ్‌ ప్రభావం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. ఇది రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీయొచ్చు. గుండె సంబంధిత సమస్యల ముప్పును పెంచొచ్చు. కిడ్నీలు కూడా ఆరోగ్యకరమైన రక్తప్రసరణపై ఆధారపడతాయి. అందుకే పొగతాగడం కిడ్నీ ఆరోగ్యానికీ అదనపు భారంగా మారొచ్చు.

బీపీ, షుగర్‌ చెక్‌ చేయకపోవడం
కిడ్నీ సమస్యలు చాలాసార్లు లక్షణాలు లేకుండానే తీవ్రమవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి ప్రధాన కారణాల్లో ఉన్నాయి. అందుకే మధుమేహం, హైబీపీ, గుండె జబ్బులు లేదా కుటుంబంలో కిడ్నీ వైఫల్యం చరిత్ర ఉన్నవారు వైద్యుల సలహాతో కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. రక్తంలో క్రియాటినిన్‌, ఈజీఎఫ్‌ఆర్‌, మూత్రంలో యూఏసీఆర్‌ వంటి పరీక్షలు కిడ్నీ పనితీరుపై కీలక సమాచారం అందిస్తాయి.
Advertisement
Kidneys
Kidney damage habits
Renal health tips
Painkiller side effects
Chronic kidney disease
High blood pressure

More Telugu News