ఉదయాన్నే వెన్న తింటే బరువు తగ్గుతారా? నిపుణులు చెబుతోంది ఇదే..!

White Butter For Weight Loss Experts Explain Morning Health Benefits
  • వైట్‌ బటర్‌తో నేరుగా బరువు తగ్గరని నిపుణుల సూచన
  • కొంతసేపు ఆకలి తగ్గించొచ్చని వివరణ
  • వెన్నలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని వెల్లడి
  • అధికంగా తింటే ఎల్‌డీఎల్‌ పెరగొచ్చని హెచ్చరిక
  • కొలెస్ట్రాల్‌ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచన
ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఓ చెంచా ఉప్పు లేని తాజా వెన్న (వైట్‌ బటర్‌).. ఈ మధ్య సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న ఆరోగ్య చిట్కాల్లో ఒకటి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మేలు చేస్తుందని కొందరు చెబుతున్నారు. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుందని ప్రచారం జరుగుతోంది. మరికొందరు మాత్రం వెన్నలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ రెండింటిలో నిజం ఏది?

ఆకలి తగ్గొచ్చా?
వైట్‌ బటర్‌లో కొవ్వు అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ కొంత నెమ్మదిగా సాగవచ్చు. దీంతో కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండొచ్చు. ఫలితంగా మధ్యలో ఎక్కువగా తినాలనే కోరిక తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా బరువు నియంత్రణకు పరోక్షంగా ఉపయోగపడొచ్చు. అయితే వెన్న తినడం వల్ల శరీరంలోని కొవ్వు నేరుగా కరిగిపోతుందని మాత్రం చెప్పలేం.

వెయిట్‌ లాస్‌కు అసలు లెక్క ఇదే
బరువు తగ్గాలంటే రోజులో తీసుకునే క్యాలరీల కంటే ఖర్చయ్యే కేలరీలు ఎక్కువగా ఉండాలి. వైట్‌ బటర్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మోతాదుకు మించి తీసుకుంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. పైగా ఇతర కొవ్వు పదార్థాలతో కలిపి ఎక్కువగా తీసుకుంటే క్యాలరీల మోతాదు మరింత పెరుగుతుంది. కాబట్టి వైట్‌ బటర్‌ను బరువు తగ్గించే ఆహారంగా చూడటం సరైంది కాదని నిపుణులు వివరిస్తున్నారు.

కొలెస్ట్రాల్‌ సంగతేంటి?
వైట్‌ బటర్‌లో సంతృప్త కొవ్వులు (శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌) ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఊబకాయం ఉన్నవారు, గుండె జబ్బుల ముప్పు ఉన్నవారు కూడా మోతాదును నియంత్రించాలి.

ఎవరైనా తినొచ్చా?
వైట్‌ బటర్‌లో కొవ్వులో కరిగే కొన్ని విటమిన్లు ఉంటాయి. శరీరానికి శక్తిని అందించడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే మోతాదు సరిపోదు. కొలెస్ట్రాల్‌ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్‌ సలహా తీసుకోవడం మంచిది.

ఎలా తీసుకుంటే మంచిది?
వైట్‌ బటర్‌ను తక్కువ మోతాదులో తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ధాన్యాలతో చేసిన రొట్టె, ప్రొటీన్‌ ఉన్న అల్పాహారం లేదా చిరుధాన్యాల ఆహారంతో కలిపి తీసుకోవడం మంచిది. ప్రాసెస్‌ చేసిన ఆహారాలతో పాటు ఎక్కువ మొత్తంలో తినకపోవడం అవసరం. మొత్తంగా చూస్తే.. ఖాళీ కడుపుతో వైట్‌ బటర్‌ తినడం వల్లే బరువు తగ్గుతామని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. మితంగా తీసుకుంటే ఆహారంలో భాగంగా ఉండొచ్చు. మోతాదు పెరిగితే మాత్రం క్యాలరీలు, కొలెస్ట్రాల్‌ రెండూ సమస్యగా మారొచ్చు.
Advertisement
White Butter
Weight Loss
Cholesterol
Saturated Fats
Healthy Breakfast
Nutrition Tips

More Telugu News