తమ్ముడికి పాముకాటు.. స్పృహ కోల్పోకుండా 150 చెంపదెబ్బలు కొట్టిన అన్న!

Arun bitten by snake as brother slaps him 150 times to keep him conscious
  • అరుణ్‌ అనే యువకుణ్ని కాటేసిన గడ్డిమూటలోని పాము
  • పరిస్థితి విషమించడంతో అన్న ఆకాశ్‌ ఆందోళన
  • తమ్ముణ్ని మెలకువగా ఉంచేందుకు 150 సార్లు కొట్టిన వైనం
  • 2 గంటల్లో అరుణ్‌కు 15 డోసుల యాంటీవీనమ్‌
  • వైద్యుల చికిత్సతో మెరుగుపడిన అరుణ్‌ పరిస్థితి
పొలానికి వెళ్లిన ఓ యువకుడిని గడ్డిమూటలో దాక్కున్న పాము కాటేసింది. క్షణాల్లో అతడి పరిస్థితి విషమించింది. స్పృహ కోల్పోయే పరిస్థితి రావడంతో అన్న తీవ్రంగా ఆందోళన చెందాడు. వైద్యుల సూచనతో తమ్ముడు మెలకువగా ఉండేలా చేయడానికి ఏకంగా 150 సార్లకు పైగా చెంపదెబ్బలు కొట్టాడు. ముఖంపై నీళ్లు చల్లుతూ దాదాపు గంటపాటు అతడి పక్కనే ఉన్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయి దేహత్‌ కొత్వాలి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. 

21 ఏళ్ల అరుణ్‌ తన అన్న ఆకాశ్‌ పొలంలో పనిచేస్తుండగా అక్కడికి వెళ్లాడు. నీళ్లు తీసుకెళ్లిన అరుణ్‌ గడ్డిమూటను పైకి ఎత్తుతుండగా అందులో దాక్కున్న పాము ఒక్కసారిగా కాటేసింది. నొప్పితో అరుణ్‌ కేకలు వేయడంతో ఆకాశ్‌ పరుగున అక్కడికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే అరుణ్‌ పరిస్థితి వేగంగా విషమించింది. అదే సమయంలో అక్కడి నుంచి వెళుతున్న మెడికల్‌ స్టోర్‌ నిర్వాహకుడు శివమ్‌ శర్మ పరిస్థితిని గమనించాడు. ఇద్దరు సోదరులను తన బైక్‌పై ఎక్కించుకుని అరుణ్‌ను మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఎమర్జెన్సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ షేర్‌ సింగ్‌ నేతృత్వంలోని వైద్య బృందం చికిత్స ప్రారంభించింది.

అరుణ్‌ను మెలకువగా ఉంచాలని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. దీంతో తమ్ముడి ముఖంపై ఆకాశ్‌ నీళ్లు చల్లుతూ చెంపలపై పదేపదే కొట్టాడు. గంట వ్యవధిలో 150 సార్లకు పైగా ఇలా చేసినట్లు సమాచారం. తీవ్ర విషప్రభావం ఉండటంతో అరుణ్‌కు రెండు గంటల్లో 15 డోసుల యాంటీవీనమ్‌ ఇచ్చారు. సాధారణంగా ఐదు డోసులు సరిపోతాయని వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత అరుణ్‌ పరిస్థితి మెరుగుపడింది. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం.

పాము కాటేసినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లడం అత్యంత కీలకం. బాధితుడిని వీలైనంత కదలకుండా ఉంచాలి. గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, బిగుతైన తాడు కట్టడం వంటి పద్ధతులకు దూరంగా ఉండాలి. తీవ్రమైన విషప్రభావం ఉంటే యాంటీవీనమ్‌ చికిత్సే ప్రధాన మార్గం.
Advertisement
Arun
Hardoi snake bite
Uttar Pradesh news
Brother saves sibling
Snake bite treatment
Anti venom doses

More Telugu News