యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

YouTube Key Change In View Counting New System From August 24
  • యూట్యూబ్ వ్యూస్ లెక్కింపు విధానంలో మార్పులు
  • ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అవ్వగానే వ్యూ కౌంట్
  • క్రియేటర్ల కోరిక మేరకే ఈ మార్పు అని తెలిపిన యూట్యూబ్
  • మానిటైజేషన్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టత
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్, తన వేదికపై వ్యూస్‌ను లెక్కించే విధానంలో కీలక మార్పులు చేపట్టింది. 2026 ఆగస్టు 24 నుంచి ఈ నూతన విధానం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇకపై షార్ట్స్, లాంగ్ వీడియోలు అనే తేడా లేకుండా, ఏ ఫార్మాట్లలో ఉన్న వీడియో అయినా ప్లే అవ్వడం ప్రారంభమైన వెంటనే దానిని ఒక పబ్లిక్ వ్యూగా పరిగణించనున్నారు.

ఇప్పటివరకు యూట్యూబ్ వివిధ వీడియో ఫార్మాట్లకు భిన్నమైన పద్ధతుల్లో వ్యూస్‌ను లెక్కిస్తూ వచ్చేది. ముఖ్యంగా షార్ట్స్ విషయంలో ఇటీవలే కొన్ని మార్పులు చేసిన యాజమాన్యం, ఇప్పుడు అదే విధానాన్ని అన్ని రకాల వీడియోలకు వర్తింపజేయాలని నిర్ణయించింది. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోల పనితీరును అంచనా వేసుకోవడం మరింత సులభతరం అవుతుందని యూట్యూబ్ భావిస్తోంది. వ్యూస్ లెక్కింపులో ఏకరూపత ఉండాలని క్రియేటర్ల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకే ఈ మార్పు చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ నూతన విధానం అమలులోకి రావడం వల్ల వీడియోల పబ్లిక్ వ్యూ కౌంట్ గతంలో కంటే వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే, పాత పద్ధతిలోని వ్యూ మెట్రిక్‌ను 'ఎంగేజ్డ్ వ్యూస్' పేరుతో యూట్యూబ్ అనలిటిక్స్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీడియో ప్రారంభమైన తర్వాత ఎంతమంది వీక్షకులు దానిని చూడటం కొనసాగించారనే విషయాన్ని ఈ మెట్రిక్ స్పష్టం చేస్తుంది.

ఈ మార్పుల వల్ల క్రియేటర్ల ఆదాయంపై కానీ, యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (వైపీపీ) అర్హతలపై కానీ ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ స్పష్టం చేసింది. మానిటైజేషన్ ప్రక్రియ కోసం ఇకపై 'క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్', 'క్వాలిఫైడ్ వాచ్ అవర్స్' అనే నూతన పదాలను వినియోగించనున్నట్లు పేర్కొంది.
Advertisement
YouTube
YouTube View Count
YouTube Shorts Views
YouTube Monetization Policy
YouTube Creator Update

More Telugu News