యూకే వర్సెస్ ఇండియా: 9 టు 5 తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది? యువతి ఏం చెప్పిందంటే..!

UK vs India How is life after 9 to 5 What the young woman said
  • యూకే, ఇండియాలోని వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై యువతి పోస్ట్
  • పని తర్వాత యూకేలో ప్రజల జీవనశైలిని చూపిన వీడియో
  • భారత్‌లో ట్రాఫిక్, అదనపు పనులతోనే సమయం వృథా అని వ్యాఖ్య
  • డబ్బుతో పాటు జీవన నాణ్యత కూడా ముఖ్యమని విశ్లేషణ
బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భారత్‌తో పోలిస్తే యూకేలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల ఉద్యోగం తర్వాత ఉండే జీవనశైలి ఎలా ఉంటుందో ఆమె వివరించారు. ఈ అంశంపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నెటిజన్లు, ముఖ్యంగా భారతీయులు ఏకీభవిస్తున్నారు.

అనుష్క వ్యాస్ అనే మహిళ ఒక సాధారణ పనిదినం రోజున సాయంత్రం తన ఇంటి సమీపంలోని పార్కులో ఈ వీడియో చిత్రీకరించారు. వారాంతాలు లేదా సెలవు దినాల్లో మాత్రమే కాకుండా, సాధారణ రోజుల్లోనూ ఇక్కడి ప్రజలు జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తారో ఆమె చూపించారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకున్నాక ప్రజలు కుటుంబంతో కలిసి పార్కులో గడపడం, సరస్సుల వద్ద పిక్నిక్‌లు నిర్వహించడం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.

ఇదే సందర్భంలో భారత్‌లోని పని సంస్కృతిపై ఆమె విశ్లేషించారు. మన దేశంలో 9 నుంచి 5 గంటల ఉద్యోగం తర్వాత ఇటువంటి ప్రశాంతమైన జీవనశైలిని ఊహించడం కష్టమని ఆమె పేర్కొన్నారు. ఆఫీసు పని ముగిశాక ట్రాఫిక్ ఇబ్బందులు, అదనపు పని ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇంటికి చేరుకునేసరికి తీవ్రంగా అలసిపోతామని తెలిపారు. దీంతో కేవలం వారాంతాల కోసమే ఎదురుచూడాల్సి వస్తుందని, ఆ సెలవు రోజులు కూడా వారం మొత్తం పడిన శ్రమ నుంచి కోలుకోవడానికే సరిపోతాయని అనుష్క వ్యాఖ్యానించారు.

డబ్బు, ఉద్యోగ అవకాశాలతో పాటు జీవన నాణ్యత కూడా ముఖ్యమని, అందుకే చాలా మంది భారతీయులు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. పనితో పాటు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించే వెసులుబాటు ఉండటం వల్లే అక్కడి ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై మరోసారి విస్తృత చర్చ మొదలైంది.
Advertisement
Anushka Vyas
UK vs India work life balance
9 to 5 job lifestyle
Quality of life UK vs India
Indian woman viral video

More Telugu News