బ్రిటీష్ కాలం నాటి కుట్రలు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది: కవిత
- చరిత్రను అర్థం చేసుకున్నవారే దేశ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించగలరన్న కవిత
- బ్రిటీష్ వారి విధానాల వల్లే దేశంలో కుల వ్యవస్థ మరింత తీవ్రమైందని వ్యాఖ్య
- ఆదివాసీలను రాజ్యం పరిధిలోకి తెచ్చి తీరని అన్యాయం చేశారని మండిపాటు
ఆంగ్లేయుల పాలనలో జరిగిన దారుణాలు, సమాజాన్ని ముక్కలు చేయడానికి వారు అవలంబించిన ‘విభజించి పాలించే’ కుట్రల గురించి నేటి తరానికి పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. మన చరిత్రను సరిగ్గా అర్థం చేసుకున్న వారు మాత్రమే దేశ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించగలరని ఆమె అన్నారు.
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయ సైనికులను బలవంతంగా వాడుకుని వేలాదిమంది ప్రాణాలను బ్రిటీషర్లు బలితీసుకున్నారని మండిపడ్డారు. వారు తెచ్చిన విధానాల వల్లే దేశంలో కుల వ్యవస్థ మరింత తీవ్రతరమైందని, అడవుల్లో ప్రశాంతంగా జీవించే ఆదివాసీలను రాజ్యం పరిధిలోకి తెచ్చి తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
బ్రిటీష్ పాలకులు దేశం విడిచి వెళ్లినా, వారి ఆలోచనా వైఖరి మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోవడం విచారకరమని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మాట్లాడేవారే గొప్ప అన్నట్లుగా చూస్తూ, మాతృభాష అయిన తెలుగు మాట్లాడేవారిని తక్కువ చేసి చూడడం ఆనాటి గులాంగిరీకి నిదర్శనమన్నారు. చర్మం రంగును బట్టి మన మధ్య వైషమ్యాలు సృష్టించిన ఆనాటి మైండ్‌సెట్‌ను వీడి, స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.